Telugu Gateway
Telugugateway Exclusives

మోడీ కి అవసరం అయినప్పుడే జగన్ బయటకు వస్తారా?!

మోడీ కి అవసరం అయినప్పుడే జగన్ బయటకు వస్తారా?!
X

జగన్ బాటలోనే చంద్రబాబు కూడా !

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలే విచిత్రం. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలుగు దేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కి రాజకీయంగా బద్ద వైరం. కానీ ప్రధాని మోడీ దగ్గరకు వచ్చే సరికి వీళ్ళిద్దరూ ఒకటే అవుతారు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తనకు ఇబ్బందిగా ఉన్న సమయంలో మౌనంగా మద్దతు ఇచ్చుకుంటూ పోతారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మాత్రం ప్రధాని మోడీ కి అవసరం అయిన సమయంలోనే బయటకు వచ్చి ట్వీట్స్ చేస్తారు. అదానీ-హిండెన్ బర్గ్ వివాదం విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జెపీసి) కోసం విపక్షాలు పట్టుపట్టగా ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు సైలెంట్ గా ఉండి పోయాయి. దీనిపై మాట్లాడితే మోడీ కి ఎక్కడ కోసం వస్తుందో అని ఇద్దరు అలా వ్యవహరించారు అంటూ విమర్శలు వచ్చాయి అప్పటిలో . ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ విషయం ఇప్పుడు దుమారం రేపుతోంది. దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము తో కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించటం ఏ మాత్రం సరికాదు అని...అందుకే తాము ఈ కార్యక్రమంలో పాల్గొనటం లేదు అని కాంగ్రెస్, డీఎంకె, టీఎంసీ, ఎన్ సిపీ , ఎస్పీ, జేడీయూ తో పాటు మొత్తం 19 పార్టీలు బాయ్ కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. విచిత్రం ఏమిటి అంటే వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఇలా చేయటం తప్పు...తాము ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని ఇతర పార్టీలు కూడా పాల్గొనాలని అయన కోరారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది...మరి ఇదే జగన్ దేశాన్ని కుదిపేసిన అదానీ -హిండెన్ బర్గ్ విషయంలో విపక్షాలు అన్నీ పోరాటం చేస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నట్లు...అంతే కాదు పరువు నష్టం కేసు లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం ఆగమేఘాల మీద రద్దు చేసినప్పుడు కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా జగన్ ఎందుకు మాట్లాడ లేదు . అంటే కేవలం మోడీ కి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయినప్పుడు మాత్రమే జగన్ బయటకు వస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

రాహుల్ గాంధీ విషయంలో జగన్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మౌనంగానే ఉండి పోయారు. పొరుగు రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా జగన్, చంద్రబాబు లది ఒకటే దారి అన్నట్లు అయింది.పొరుగునే ఉన్న కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కి అభినందనలు తెలిపే సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే అక్కడ ఓడిపోయింది బీజేపీ, ప్రచారం చేసింది ప్రధాని మోడీ కాబట్టి. కరోనా సమయంలో కూడా ప్రధాని మోడీ నిర్వహించిన ఒక సమీక్షలో మన్ కి బాత్ తరహాలో అయన చెప్పుకుంటూ పోయారు తప్ప ..కొన్ని కీలక విషయంపై ప్రధాని సీఎం ల మాటలు కూడా విని ఉంటే బాగుండేది అంటూ అప్పటిలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ట్వీట్ చేశారు. విచిత్రంగా దీనిపై స్పందించిన సీఎం జగన్ ఈ సమయంలో విమర్శలు చేయటం సరికాదు అని...ఇలా చేయటం కాకుండా కరోనా పై యుద్ధంలో అందరం కలిసి ప్రధాని మోడీ చేతులను మరింత బలోపేతం చేయాలి తప్ప వేలెత్తి చూపటం కరెక్ట్ కాదు అంటూ జగన్ చేసిన ట్వీట్ అప్పట్లో దేశ రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కూడా జగన్ కీలక పార్టీ లు అన్ని మోడీ నిర్ణయాన్ని తప్పుపడుతుంటే అయన మాత్రం మోడీ కి మద్దతుగా ట్వీట్ చేయటం చర్చనీయాంశగా మారింది. అధికారికంగా ఏమి చెప్పలేదు కానీ టీడీపీ కూడా వైసీపీ తరహాలోనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు అవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున ఎంపీలు ఉన్నా కూడా చాలా సార్లు జాతీయ అంశాలపై వైసీపీ ఒక స్టాండ్ లేకుండా వ్యవహరిస్తోంది అనే విమర్శలు మూట కట్టుకుంటోంది. ఎప్పుడూ పెద్దగా ప్రతిపక్షాల వైపు నిలబడిన దాఖలాలు లేవు కానీ ప్రధాని మోడీ కి మద్దతుగా మాత్రం నిలబడుతూ వస్తోంది.



Next Story
Share it