Telugu Gateway
Telugugateway Exclusives

అధికారం పోతేనే చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ కొస్తారేమో!

అధికారం పోతేనే చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ కొస్తారేమో!
X

అమరావతి వెళ్లాక జయంతి..వర్థంతిలకూ కన్నెత్తిచూడని బాబు

ప్రతిపక్షలో ఉంటే మాత్రం హాజరు

అవకాశవాదానికి పరాకాష్ట అని నేతల వ్యాఖ్యలు

ఎన్టీఆర్. సినిమాల్లో..రాజకీయాల్లో ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే అందుకు కారణం ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీనే. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉంటే ఒకలా వ్యవహరిస్తారు. మిగిలిన నేతల విషయంలోనో..ఇతర వ్యక్తుల విషయంలో అలా వ్యవహరించారనుకుంటే ఎవరైనా సర్దుకుపోతారు. కానీ స్వయంగా పార్టీ వ్యవస్థాపకుడు, తన మామ అయిన ఎన్టీఆర్ విషయంలోనూ చంద్రబాబుది అదే ధోరణి. రాష్ట్ర విభజన అనంతరం అమరావతికి వెళ్లాక ..అధికారంలో ఉండగా చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ జయంతి, వర్ధంతులకు కూడా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వైపు అడుగుపెట్టలేదు. అప్పట్లో నిత్యం ఎక్కేది ప్రత్యేక విమానం..దిగేది ప్రత్యేక విమానం అయినా ఇటువైపు చూడలేదు. అమరావతిలోని ఓ విగ్రహం వద్ద నివాళులు అర్పించేవారు. అమరావతిలో శాశ్వత రాజధాని కట్టలేదు సరికదా..ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్టీఆర్ స్మారకాన్ని కూడా పూర్తి చేయలేదు.

అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్ ను మర్చిపోయి తననే గుర్తుంచుకోవాలనే తరహాలో పాలన సాగించే ప్రయత్నం చేసేవారు. అందుకే గతంలో ఎన్నడూలేని రీతిలో మొన్నటిసారి మాత్రం పలు పథకాలకు 'చంద్రన్న' పేర్లు తగిలించారు. అదే చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి అని..సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య వ్యక్తిగా ఎదిగారని ప్రశంసించారు. ప్రజలకు ఏమి కావాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారని..ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. సినిమాలు..రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it