Telugu Gateway
Telugugateway Exclusives

ఎన్టీఆర్..చంద్రబాబుకు ఓ రాజకీయ అవసరం..అంతే !

ఎన్టీఆర్..చంద్రబాబుకు ఓ రాజకీయ అవసరం..అంతే !
X

అధికారంలో ఉండగా ఎన్టీఆర్ ఘాట్ కు రాని చంద్రబాబు

ఎన్టీఆర్. ఆ పేరు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనే కాకుండా..దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం. ఎంతో మంది కొత్త వాళ్లకు రాజకీయ అవకాశాలు వచ్చింది ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటుతోనే. అలాంటి ఎన్టీఆర్ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాత్రం 'ఓ రాజకీయ అవసరం' మాత్రమే. ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా ఎన్టీఆర్ పేరు గుర్తుండదు. ఏదో మొక్కుబడిగా కొన్ని పథకాలకు ఆయన పేరు పెడతారు. కానీ ఎంతసేపూ ఎన్టీఆర్ పేరు మర్చిపోయేలా చేసి...తాను మాత్రమే ఉండేలా వెలుగులో ఉండేలా చూసుకునేందుకు తహతహలాడారు. అధికారంలో ఉండగా ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించిన ఓ వీడియో లీక్ అయి అప్పట్లో పెద్ద కలకలం సృష్టించింది. ఇది ఒకెత్తు అయితే రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లో సచివాలయంలో ఉన్న సమయంలో తప్ప..అమరావతికి వెళ్ళాక చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరు కావటం కూడా మానేశారు.

అమరావతిలోనే ఫోటోకు దండవేసి నివాళులు అర్పించేవారు. అధికారంలో ఉంటూ నిత్యం ప్రత్యేక విమానాల్లో తిరిగిన ఆయన పార్టీ వ్యవస్థాపకుడు, సొంత మామ అయిన ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిలను కూడా విస్మరించారు. ఇదే విషయంపై ఒకప్పటి టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఓ సారి ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉ:డటంతో చంద్రబాబు ఎన్టీఆర్ 25 వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, మనమడు దేవాన్ష్ లతో వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. మరో విశేషం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ విడిగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు.

గత కొంత కాలంగా పార్టీ పదవి విషయంలో చంద్రబాబు, నారా లోకేష్ ల..బాలకృష్ణల మధ్య గ్యాప్ వచ్చిన విషయం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందుకే హైదరాబాద్ లో ఉండి కూడా కలసి కాకుండా..విడిగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించటం మరోసారి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు...ఎన్టీఆర్ తనయుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించిన ఫోటోలను కూడా టీడీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పెట్టలేదు. (ఈ వార్త పబ్లిష్ చేసే 12.40 నిమిషాల వరకూ). చంద్రబాబు, నారా లోకేష్ ల కంటే ముందే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించి వెళ్ళారు. వీళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు తప్ప..బాలకృష్ణను మాత్రం విస్మరించారు. టీడీపీ అధికారిక పేజీలో ఎవరెవరివో ఫోటోలు...వీడియోలు పెట్టే వారు ఎన్టీఆర్ కొడుకు, ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన బాలకృష్ణను విస్మరించటం అంటే వీరి మధ్య విభేదాలు మరింత పెరిగాయని భావిస్తున్నారు.

Next Story
Share it