ఈ టీఆర్ఎస్ యాడ్ చెబుతున్నది ఏమిటి?
కెసీఆర్ జాతి నిర్మాణం చేయగల నేత అంటూ పొగడ్తలు
సమగ్రత..దూరదృష్టి ఉన్న నాయకుడు అంటూ ప్రశంసలు
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంపై ఇది అధికారిక ప్రకటనే!
తెలంగాణ మంత్రులు..టీఆర్ఎస్ నాయకులు ఎప్పటి నుంచో కెసీఆర్ ప్రధాని కావాలి..దేశానికి ఓ దారి చూపాలని చాలాసార్లు బహిరంగంగానే కోరారు. అదే సమయంలో కెటీఆర్ సీఎం కావాలి..కెసీఆర్ ప్రధాని కావాలి అన్న నినాదాన్ని అందుకున్న వాళ్ళూ కూడా ఉన్నారు. ఇవి చూసిన వారంతా అదినేత దృష్టిలో పడటానికి..భవిష్యత్ నేతను కాకా పట్టడానికి ఇలాంటివి సహజమే అని చూసి వదిలేశారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీనే అధికారికంగా ఓ ఆంగ్ల పత్రికలో ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటన ఆసక్తికరంగా..అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. అది ఏంటి అంటే సీఎం కెసీఆర్ జాతి నిర్మాణం చేయగల సత్తా ఉన్న నాయకుడు అని..అంతే కాకుండా సమగ్రత, దూరదృష్టి ఉన్న నాయకుడు అని కీర్తిస్తూ ప్రకటన ఇచ్చింది. కెసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫుల్ పేజీ యాడ్ ఆంగ్ల పత్రికలో ప్రచురితం అయింది. ఇక తెలుగు పత్రికల్లో అయితే మంత్రులు..నేతలు ఇచ్చిన యాడ్స్ తో పేపర్లు అన్నీ గులాబీమయంగా మారాయి. గత కొంత కాలంగా కేంద్రంలోని బిజెపి, ప్రధాని మోడీపై సీఎం కెసీఆర్ , టీఆర్ఎస్ నేతలు గతంలో ఎన్నడూలేని రీతిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
అంతే కాదు..బిజెపిని దేశం నుంచి లేకుండా చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని..ప్రధాని మోడీ ఈ ఎనిమిదేళ్లలో చేసింది ఏమీలేదని..ఆయన తన కురచబుద్ధిని చూపించుకున్నారంటూ కెసీఆర్ మండిపడుతున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ అధికారిక యాడ్ ద్వారానే కెసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు స్పష్టం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అధికారిక ప్రకటన వంటిదే. ఇంత కాలం ప్రజలు కోరితే జాతీయ రాజకీయాల్లోకి వెళతానంటూ చెప్పిన కెసీఆర్ ఇలా అధికారిక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరుతో ఇంత పెద్ద యాడ్ వచ్చింది అంటే అది కెసీఆర్ అనుమతి లేకుండా వచ్చే ఛాన్స్ లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగానా అన్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితులలో దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మాట్లాడుతూ కేసీఆర్ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు.
అకస్మాత్తుగా కెసీఆర్ జాతీయ రాజకీయాల అంశాన్ని లేవనెత్తటం వెనక పలు అంశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నట్లు మంత్రి కెటీఆర్ ను సీఎం పదవిలో కూర్చోపెట్టి..ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళతారని..అదే సమయంలో హైదరాబాద్ వేదికగా బిజెపిని నిత్యం టార్గెట్ చేస్తూ ఉండటం ద్వారా రెండు టర్మ్ ల తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలన్నది ఆయన ప్లాన్ గా చెబుతున్నారు. ఏది ఏమైనా నేతల కోరికే కాదు..టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఆలోచన కూడా అదే అన్నట్లు ఈ యాడ్స్ స్పష్టంగా చేస్తున్నాయి. పార్టీ పేరుతో ఇచ్చిన తెలుగు పత్రికకు చెందిన ఓ యాడ్ లో మాత్రం ప్రజలే తన ప్రపంచం, దేశ ప్రగతే తన గమ్యం అని పేర్కొనటం విశేషం. అంటే కేవలం ఆంగ్ల పత్రిక ద్వారానే పంపాల్సిన వారికి సందేశం పంపారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.