Telugu Gateway
Telugugateway Exclusives

రేవంత్ ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యాఖ్య‌ల వెన‌క వ్యూహమేంటి?

రేవంత్ ముంద‌స్తు ఎన్నిక‌ల  వ్యాఖ్య‌ల వెన‌క  వ్యూహమేంటి?
X

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గ‌త కొన్ని రోజులుగా ప‌దే ప‌దే ముంద‌స్తు ఎన్నిక‌లు గురించి మాట్లాడుతున్నారు. తొలి ట‌ర్మ్ లో కెసీఆర్ ఓ ఆరు నెల‌లు ముందుగా ఎన్నిక‌ల‌కు వెళ్లి లాభ‌ప‌డ్డారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు,అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి వ‌స్తే అది రాజకీయంగా త‌మ‌కు లాభ‌దాయ‌కంగా కాద‌ని అప్ప‌ట్లో ఈ ప్ర‌యోగం చేశారు..స‌క్సెస్ అయ్యారు. మ‌ళ్ళీ ప్ర‌తిసారి అలాగే చేస్తారా?. కెసీఆర్ చేయాల‌నుకున్నా కేంద్రంలో ఉన్న బిజెపి, ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా కెసీఆర్ కు ఈ సారి అంత‌గా ఎందుకు స‌హ‌క‌రిస్తుంది. ఇది జ‌రిగే ప‌ని కాదు. కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల వెన‌క ప‌క్కా వ్యూహం ఉంద‌ని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ఎప్ప‌టి నుంచో ఓ ప్ర‌చారం ఉంది. ప్ర‌స్తుత మంత్రి, కెసీఆర్ త‌న‌యుడు కెటీఆర్ ను సీఎం పీఠంపై కూర్చోపెడ‌తార‌ని. సీఎం కెసీఆర్ మ‌ద్య‌లో ఈ ప్ర‌చారాన్ని తీవ్రాతితీవ్రంగా ఖండించినా కూడా పార్టీలోఈ ప్ర‌చారానికి తెర‌ప‌డ‌టం లేదు. యాదాద్రి ప్రారంభోత్స‌వం...యాగం త‌ర్వాత ఇది ప‌క్కాగా ఉంటుంద‌ని పార్టీ నేత‌ల మాట‌. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా కెటీఆర్ కు కెసీఆర్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నే ఇవ్వ‌ర‌ని..ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని చెబుతూ వ‌స్తున్నారు. టీఆర్ఎస్ లో ప్ర‌చారం జ‌రిగిన‌ట్లుగా కెటీఆర్ కు సీఎం ప‌ద‌వి అప్ప‌గిస్తే రేవంత్ అండ్ టీమ్ కు రాజకీయంగా ఇది ఓ అస్త్రంగా మారి..కాంగ్రెస్ పార్టీకి క‌ల‌సి వ‌స్తుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. కెసీఆర్ మాట‌లు..వ్యూహాల‌కు ఇంకా ప‌దును ఉంది. అయితే ప‌దేళ్ళ పాల‌న వ్య‌తిరేకత‌ను కూడా ఏ మాత్రం విస్మ‌రించ‌టానికి వీల్లేదు. కెటీఆర్ ను సీఎం చేస్తే త‌మ టార్గెట్ మ‌రింత సుల‌భం అవుతుంద‌ని రేవంత్ అండ్ టీమ్ అంచ‌నాగా ఉంది.

ఎలాంటి కార‌ణం లేకుండా కెటీఆర్ కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అప్ప‌గిస్తే రాజ‌కీయంగా అది పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. రేవంత్ ఇప్ప‌టికే మంత్రి కెటీఆర్ ను ఉద్దేశించి తాను నీలాగా రెడీమేడ్ గా వ‌చ్చి ప‌ద‌వులు అలంరించ‌లేదంటూ కెటీఆర్ కు కౌంట‌ర్లు ఇస్తున్నారు. అలాంటిది ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో కెటీఆర్ ను కూర్చోపెడితే త‌మ‌కు అంత‌కు మించిన అస్త్రం మ‌రొక‌టి ఉండ‌ద‌నేది రేవంత్ వ‌ర్గం ఆశ‌. అదే స‌మ‌యంలో కెసీఆర్ తో పోలిస్తే కెటీఆర్ ను ఢీకొట్ట‌డం త‌మ‌కు మ‌రింత సుల‌భం అవ‌టంతోపాటు..రాజ‌కీయంగా కూడా త‌మ‌కు ఓ బ‌ల‌మైన అస్త్రం దొరుకుతుంద‌నేది రేవంత్ గ్రూప్ అంచ‌నాగా ఉంది. కెటీఆర్ కు సీఎం ప‌ద‌వి అప్ప‌గించాల‌ని కెసీఆర్ పై ర‌క‌ర‌కాల ఒత్తిళ్ళు ఉన్నాయ‌ని పార్టీలో ప్ర‌చారం. ఈ అంశాలన్నింటిని గ‌మ‌నంలోకి తీసుకునే రేవంత్ రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌ల‌తోపాటు ప‌దే ప‌దే కెటీఆర్ సీఎం కాడు అనే అంశాన్ని లేవ‌నెత్త‌తున్నాడ‌ని భావిస్తున్నారు. ఈ ప‌రిణామాలు అన్నీ చూస్తుంటే రేవంత్ చెప్పే వాటిల్లో ఏది చేసినా..ఏది చేయక‌పోయినా కెసీఆర్ కు ఒకింత ఇర‌కాట‌మే అని చెప్పొచ్చు. మొత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌కందాయంలో ప‌డ‌బోతున్నాయి.

Next Story
Share it