సీపీఆర్ వోనా ...టీఆర్ఎస్ కార్యకర్తా?
ప్రభుత్వం..పార్టీకి మధ్య తేడా చెరిగిపోవటం ఎప్పుడో ప్రారంభం అయింది. ఇప్పుడు ప్రభుత్వమే పార్టీ అవుతోంది..పార్టీయే ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వానికి..పార్టీకి మధ్య సన్న విభజన రేఖ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరూ వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అందుకు ఈ వ్యాసమే ఓ ఉదాహరణ. వనం జ్వాలా నరసింహరావు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి. ఆయన ఆంధ్రజ్యోతి పత్రికకు ఓ వ్యాసం రాశారు. దాని శీర్షిక ఏమిటంటే తెలంగాణ కోసమే టీఆర్ఎస్ లో చేరికలు. సీపీఆర్ వోగా ప్రభుత్వ పథకాలు..ప్రభుత్వ విజయాలు ఏమైనా ఉంటే ఆయన సీపీఆర్ వోగా వ్యాసం రాయటాన్ని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం ఉండదు. కానీ సీపీఆర్ వో గా ప్రభుత్వం నుంచి లక్షలకు లక్షలు జీతం తీసుకుంటూ పార్టీ కోసం ఏకంగా ఓ ప్రధాన పత్రికకు వ్యాసం రాయటం చూసి ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ఆయన వ్యాసంలోని నాలుగు కొన్ని లైన్లు ఓ సారి చూసి తరించండి.'తెలంగాణ అన్ని రకాలా బాగుపడాలి. అభ్యుదయాన్ని కాంక్షించే శక్తులన్నీ ఏకమై రాష్ట్రాన్నిఅభివృద్ధి చేయాలి. అందుకోసమే పునరేకీరణ. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల చేరికతో తెలంగాణ రాష్ట్ర సమితి మరింత బలపుతున్నది. ముఖ్యమంత్రి కెసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమైనామని చేరిన వారూ, చేరబోతున్నవారూ ప్రకటించారు. ఈ కారణాలతో పార్టీ మారితే తప్పేమిటి? ' అని జ్వాలానరసింహరావు ప్రశ్నించారు.
మరి ఇదే జ్వాలా నరసింహరావుకు ప్రతిపక్షంలో ఉండగా కెసీఆర్ ఫిరాయింపులపై ఏమి అన్నారో తెలియదా?. 'ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్ళను పార్టీ ఫిరాయింపునిస్తరయా?. ఎంత అనైతికం మీరు మాట్లాడేది. చీరి చింతకుకడతారు ప్రజలు. ఏమి అనుకుంటున్నరు. తమాషాగా ఉందా. ఇంత కిరికిరి ఉంటదా. ఇంత దాదాగిరి ఉంటదా. ఇంత వ్యభిచారం ఉంటదా రాజకీయాల్లో. మీరు ఎట్ల టాలరేట్ చేస్తరయా. యాజ్ ఏ జర్నలిస్ట్. ఉల్టానన్ను కొశ్చన్ అడుగున్నారు. ఎథిక్స్ ఏమైనా ఉంటదా పాలిటిక్స్ లో. ఆడనే మీరే చెంప చెళ్ళు మన్పించాల. సిగ్గుపడాలి. మీరే అడగాల. దటీజ్ జర్నలిజం. ' అని కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.మరి ఈ విషయం జ్వాలా నరసింహరావుకు తెలియదా?. తెలిసినా ..మనకెందుకు...మనం మన భజన చేస్తే ఓ పని అయిపొద్ది అనుకున్నారా?. 2018లో ఎన్నికల తర్వాత చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అంతా కూడా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరారు అంట.. భవిష్యత్ లో మరికొంత మంది చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని ఆయన తీర్మానించారు. అంతే కాదు ఈ వ్యాసాన్ని తన ఫేస్ బుక్ పేజీలో కూడా షేర్ చేశారు.