Telugu Gateway
Telugugateway Exclusives

వ్యాక్సిన్ రేస్...విజేత ఎవరు?!

వ్యాక్సిన్ రేస్...విజేత ఎవరు?!
X

గత కొన్ని రోజులగా వ్యాక్సిన్ కు సంబంధించి సానుకూల వార్తలు వెలువడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి వార్తలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్ తోపాటు మోడెర్నా కూడా తమ తమ వ్యాక్సిన్లు 95 శాతం సమర్థతతో పనిచేస్తున్నాయని ప్రకటించాయి. అయితే ఈ ప్రకటనలపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకపోయినా ఏ వ్యాక్సిన్ ప్రజలకు ముందు అందుబాటులోకి తెచ్చేది ఎవరు?. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటం అనేది అత్యంత కీలకం. ఈ వ్యాక్సిన్ డోస్ లు తీసుకున్న తర్వాత ఎవరికైనా తీవ్రమైన సమస్యలు వస్తే ఆ వ్యాక్సిన్ ప్రమాదంలో పడినట్లే. ఒక రకంగా చెప్పాలంటే ఇది కత్తిమీద సాములాంటి వ్యవహారం అని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆయా కంపెనీల ప్రకటనలు ఎలా ఉన్నా వాటి పనితీరు..ప్రతికూల ప్రభావం చూపించకుండా ఉండటం అనేది అత్యంత కీలక అంశంగా మారనుంది.

ఇప్పటికే కోవిడ్ 19కు సంబంధించిన వ్యాక్సిన్ల విషయంలో ఖచ్చితంగా ఫైజర్, మోడెర్నాలు కూడా మూడవ దశ ప్రయోగాలు పూర్తి చేసుకుని నివేదికలతో సిద్ధంగా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆక్స్ ఫర్ట్, ఆస్ట్రాజెనెకాతోపాటు జాన్సన్ అండ్ జాన్సన్ లకు సంబంధించి కూడా కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆక్స్ ఫర్డ్ టీకాను భారత్ లో సీరమ్ ఇన్ స్టిట్యూట్ పరీక్షల బాధ్యత తీసుకుని తయారీ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ నాటికి ఖచ్చితంగా అత్యవసర వినియోగానికి కనీసం మూడు నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన మూడవ దశ ప్రయోగాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే తమ వ్యాక్సిన్ వచ్చే మార్చి నాటికి సిద్ధం అవుతుందని కంపెనీ ప్రకటించింది.

అయితే తాజాగా భారత్ బయోటెక్ మరో కీలక విషయం వెల్లడించింది. టీకాతో పాటు ముక్కుల్లో వేసే మందును కూడా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది. ఇది వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు తక్కువ..ఆధారపడిన దేశాలు ఎక్కువ. అందుకే వ్యాక్సిన్ రేస్ లో విజేతగా నిలిచిన కంపెనీకి కాసుల వర్షం కురవనుంది. అయితే ఇది ఎన్నో అడ్డంకులను అధిగమించిన వారికి మాత్రం కాసుల వర్షం కురవటం ఖాయం. అయితే తొలి వ్యాక్సిన్ కే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అందుకే పలు కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటూనే వ్యాక్సిన్ అభివృద్ధిలో నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. మరి ఈ వ్యాక్సిన్ రేసులో తొలి విజేతగా ఎవరు నిలుస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it