కేంద్రం ఇప్పుడు ఏ ధరకు వ్యాక్సిన్లు కొంటుంది?
పాత ధరే కొనసాగుతుందా?. మార్పులు ఉంటాయా?
దేశంలోని వ్యాక్సిన్ కంపెనీలు విచిత్రంగా కేంద్రానికి ఓ రేటు..రాష్ట్రాలకు ఓ ధర ప్రకటించాయి. మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రులకు ఓ ధర. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అయినా డోంట్ కేర్ అన్నారు. కొంత రచ్చ తర్వాత రాష్ట్రాలకు విక్రయించే వ్యాక్సిన్ ధరల్లో ఆయా కంపెనీలు మాత్రం కొద్దిపాటి మార్పులు చేశాయి. రాష్ట్రాలకు వచ్చే వ్యాక్సిన్లకు సంబంధించి కోవాగ్జిన్ ధర 600 రూపాయల నుంచి 400 రూపాయలకు తగ్గించింది. అదే కోవిషీల్డ్ 400 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అసలు రాష్ట్రాలు అసలు వ్యాక్సిన్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు కేంద్రం గతంలో సేకరించినట్లు రెండు కంపెనీల వ్యాక్సిన్లను డోసు 250 రూపాయలకే కొనుగోలు చేస్తుందా?. లేక ధరలు పెంచుతుందా?. పాత ధరకే సరఫరా చేసినా కొత్త సమస్య వస్తుంది. లేదు రేటు పెంచాలన్నా కూడా కొత్త సమస్య తెరమీదకు వస్తుంది. దీంతో తాను కొనుగోలు చేసే 75 శాతం డోసులకు కేంద్రం ఎంత ధర చెల్లించబోతున్నది అన్నది కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారనుంది.
ఇప్పటివరకూ అయితే దీనిపై అటు కంపెనీలు కానీ..ఇటు కేంద్రం కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మారిన విధానం ప్రకారం కొనుగోళ్లు ప్రారంభం అయిన తర్వాత ఈ ధర అంశం తెరపైకి రావొచ్చు. అయితే వ్యాక్సిన్ కేటాయింపుల విషయంలో మాత్రం కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. జనాభా ప్రతిపాదికనే ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరాచేస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్లను వేస్ట్ చేసే వారికి మాత్రం కోతలు ఉంటాయని హెచ్చరించింది. జనాభాతో పాటు కరోనా కేసుల తీవ్రత అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు నూతన విధానాల్లో తెలిపారు. అదే సమయంలో రాష్ట్రాలు తమ దగ్గర ఉన్న వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేసినందుకు తీసుకునే సర్వీసు ఛార్జి 150 రూపాయలు మించకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. విదేశాల నుంచి దిగుమతి అయ్యే స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్ల ధర మాత్రం దేశమంతటా ఒకేలా ఉన్న విషయం తెలిసిందే.