ఒక్క ఎన్నిక..ఎన్ని మార్పులు
నిధులు అన్నీ దళిత..గిరిజన వాడలకే
ఎంపీలాడ్స్..ఎమ్మెల్యే నిధులు..డిస్కమ్స్...మిషన్ భగీరథ నిధులు కూడా
పైలట్ ప్రాజెక్టులు అన్నీ హుజూరాబాద్ లోనే
సీఎస్ సోమేష్ కుమార్ మెమో జారీ
పైలట్ ప్రాజెక్టులన్నీ హుజూరాబాద్ లోనే. వేల కోట్ల రూపాయలతో తలపెట్టిన దళిత బంధుతో సహా. అంతే కాదు..పంచాయతీల్లోని దళితవాడలు, గిరిజన గ్రామాల్లో మౌలికసదుపాయాల కల్పనకు సంబంధించి కూడా హుజూరాబాద్ నే పైలట్ గా అమలు చేశారు. ఒక్క ఉప ఎన్నిక. ఎన్ని మార్పులు. ఎంత హంగామా. ఏడేళ్లలో ఎప్పుడూ రాని రీతిలో ఇప్పుడే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు అకస్మాత్తుగా దళితవాడలు, గిరిజన తండాలు ఎందుకు గుర్తొచ్చాయో. పలువురు ప్రజా ప్రతినిధులు, దళిత, గిరిజన నేతలు గ్రామ పంచాయతీలతోపాటు మున్సిపల్ ప్రాంతాల్లోని అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్స్, వీధి దీపాలు, విద్యుత్ శాఖ ఆధారిత మౌలికసదుపాయాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వం దృష్టికి తెచ్చారంట. సర్కారు కూడా అంతే ఆగమేఘాల మీద కదిలింది. దీనికి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించారంట కూడా. పలు బృందాలకు బృందాలు హుజూరాబాద్ లో పర్యటించి మౌలికసదుపాయాల్లో గ్యాప్ లను గుర్తించాయని..అందుకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు అంచనాలు కూడా సిద్ధం చేశారన్నారు. ఈ మేరకు పనులు మంజూరు చేశారని..పనులు ప్రారంభించి త్వరలోనే వాటిని పూర్తి కూడా చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ నెల 4వ తేదీన జారీ చేసిన మెమో 6823-జీపీ. ఫైనాన్స్ ఏ-2-2021లో పేర్కొన్నారు. హుజూరాబాద్ లో చేసిన తరహాలోనే ప్రతి గ్రామ పంచాయతీలోని దళితవాడలు, గిరిజన తండాల్లో చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అందులో పేర్కొన్నారు.
అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు సమగ్ర కసరత్తు చేసి గ్రామాల్లోని మౌలికసదుపాయాల అవసరాన్ని గుర్తించి పది రోజుల్లో అంచనాలు సిద్ధం చేయించాలని ఆదేశించారు. దీనికి అవసరం అయ్యే నిధులను మెటీరియల్ కాంపొనెంట్ కోసం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులతోపాటు మున్సిపల్ ఫండ్స్, పట్టణ ప్రగతి నిధులు, గ్రామ పంచాయతీ పల్లె ప్రగతి నిధులు, జెడ్పీ, ఎంపీపీ నిధులు, ఎంపీలాడ్స్, ఎమ్మెల్యే నియోజకవర్గ డెవలప్ మెంట్ నిధులు, మిషన్ భగీరధ నిధులు, డిస్కమ్స్ ఫండ్స్, సీఆర్ఆర్ ఫండ్స్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ నిధులు కూడా వీటికి వాడాలన్నారు. కలెక్టర్లు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సత్వరమే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్, మిషన్ భగరీధ ఇంజనీర్ ఇన్ ఛీఫ్, ట్రాన్స్ కో జెఎండీ తమ తమ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తూ పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు.