Telugu Gateway
Telugugateway Exclusives

ఏపీలో 'మార్చి'వరకూ ఎన్నికల సందడే!

ఏపీలో మార్చివరకూ ఎన్నికల సందడే!
X

పంచాయతీ ఎన్నికలు కాగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు

తన హయాంలోనే అన్ని ఎన్నికల పూర్తికి ఎస్ఈసీ రెడీ

ఈ ఏడాది మార్చి నాటికి ఏపీలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి రాబోతున్నాయా?. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రంగం సిద్ధం చేసుకున్నారా?. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి పాత నోటిఫికేషన్ తోనే ఎన్నికలకు వెళతారా? లేక గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అన్నది ఒక్కటే తేలాలి తప్ప..ఎన్నికలు మాత్రం పక్కా అంటున్నారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ ఈ ఏడాది మార్చిలో పదవి విరమణ చేయనున్నారు. ఆయన తన పదవి కాలం సమయంలోనే ఈ ఎన్నికలు అన్నీ పూర్తి చేసేలా రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో సర్కారుకు ఈ విషయంలో వీటిని అడ్డుకోవటానికి మరో లేకుండా పోయింది.

రాష్ట్రంలో ఎన్నడూలేని రీతిలో ఏపీ సర్కారు, ఎస్ఈసీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. రమేష్ కుమార్ హయంలో ఎన్నికలు జరపకుండా చూడాలని సర్కారు..ఎలాగైనా ఎన్నికలు జరపాలని రమేష్ కుమార్ చేసిన ప్రయత్నాల్లో చివరకు ఎస్ఈసీనే పైచేయి సాధించారు. అందుకే ఆయన గతంలో ఎవరూ చేయని రీతిలో రోజూ జిల్లాల్లో పర్యటిస్తూ మరీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలోనే పెండింగ్ లో ఉన్న అన్ని ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. సాంకేతికంగా చూస్తే ఇంకా పాత నోటిఫికేషన్ రద్దు కాలేదు కాబట్టి..అది అమల్లో ఉన్నట్లే లెక్క. తేదీలు ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది.

లేదు గత ఏకగ్రీవాలను రద్దు చేయాలనుకుంటే మాత్రం కొత్త నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఎస్ఈసీ ప్రణాళికల ప్రకారం చూసుకుంటే మార్చి నెలాఖరు వరకూ ఏపీలో ఎన్నికల సందడి కొనసాగనుంది. ఇప్పటికే ప్రభుత్వం, ఎస్ఈసీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మరి ఈ ఎన్నికలకు కూడా తేదీలు ప్రకటించి మార్చిలోగా పూర్తి చేయాలని చూస్తే సర్కారు వైఖరి ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ఇప్పటికే ఎస్ఈసీపై ఇద్దరు మంత్రులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వగా..అధికార వైసీపీ మాత్రం ఎస్ఈసీ వైఖరి ఇలాగే ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it