జూబ్లిహిల్స్ హౌసింగ్ కొఆపరేటివ్ సొసైటీ లో 200 ఫైళ్ళు గల్లంతు
ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన కమిటీ
తెలంగాణలో కెసీఆర్ ప్రభుత్వం తప్పులు ఎవరు చేసినా క్షమించేది లేదు అని పదే పదే ప్రకటనలు చేస్తుంటుంది. ఈటెల రాజేందర్ వంటి వారిపై అలా ఫిర్యాదులు వస్తే ఇలా కమిటీల మీద కమిటీలు వేసి విచారణలు జరిపిస్తుంది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవటం తప్పేమీ కాదు. అయితే ఈ వ్యవహారం తమకు నచ్చిన వారి విషయంలో అయితే ఒకలా..నచ్చని వారి విషయంలో అయితే మరోలా ఉండటమే ఇక్కడ సమస్య. హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లిహిల్స్ హౌసింగ్ కొఆపరేటివ్ సొసైటీ గత కొన్నేళ్ళుగా అక్రమాలు..అవినీతి కూపంలో కూరుకుపోయాయి. ఈ విషయాలు అన్నీ తెలిసి కూడా తెలంగాణ సర్కారు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోనేందుకు ఆసక్తిచూపించకపోగా..అక్రమార్కులకు అండగా నిలబడుతోందని, వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందనే సొసైటీ సభ్యులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం రంగంలోకి గత పదిహేనేళ్ళ నాటి రికార్డులను పరిశీలిస్తే ఇందులో ఇందులో జరిగిన వేలాది కోట్ల రూపాయల అక్రమాలు గుట్టు రట్టు అవుతుందని చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
సొసైటీకి సంబంధించి ఒకటి కాదు..రెండు కాదు. ఏకంగా రెండు వందల వరకూ ఫైళ్లు గల్లంతు అయ్యాయి. సంవత్సరాలకు సంవత్సరాల తరబడి సొసైటీని గుప్పిట్లో పెట్టుకున్న పెద్దలు చేసిన నిర్వాకాలు ఇప్పటికే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉన్న ఫైళ్లలోనే అక్రమాలు కుప్పలు తెప్పలుగా ఉండగా..మరి ఈ మిస్ అయిన ఫైళ్ళలో ఏమి ఉన్నాయి. ఎంత దోపిడీ జరిగింది. అసలు ఈ ఫైళ్లు తిరిగి వస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఓ పెద్ద సమస్యగా మారింది. అయితే జూబ్లిహిల్స్ హౌసింగ్ కొఆపరేటివ్ సొసైటీ నూతన పాలక వర్గం కొద్ది రోజుల క్రితం ఈ ఫైళ్ల మిస్సింగ్ వ్యవహారంపై రిజిస్ట్రార్, కమిషనర్ ఆఫ్ సొసైటీస్ కు ఫిర్యాదు చేసిందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఫైళ్ళ మిస్సింగ్ తోపాటు అక్రమాలు ఏమి జరిగినా దీనికి గత కమిటీకి ప్రెసిడెంట్ గా ఉన్న తుమ్మల నరేంద్ర చౌదరితోపాటు అప్పటి కార్యదర్శి హనుంతమరావు, ఇతర మేనేజ్ కమిటీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు. మరి ప్రభుత్వం ఈ ఫైళ్ళ మిస్సింగ్ వ్యవహారంలో అక్రమార్కులకు అండగా నిలుస్తుందా..లేక వీటిని సరిదిద్దేందుకు సహకరిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. అయితే గత కొన్నేళ్ళుగా సొసైటీలో సాగుతున్న అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్రమార్కులే పక్కనే నిలబడుతుందని సభ్యలు వ్యాఖ్యానిస్తున్నారు.