Top
Telugu Gateway

తుమ్మల నరేంద్రచౌదరి బిగ్ స్కామ్

తుమ్మల నరేంద్రచౌదరి బిగ్ స్కామ్
X

జూబ్లిహిల్స్ సొసైటీ స్థలాల్లో 'భూమాయ'

చౌదరితోపాటు పాత కమిటీపై కేసు నమోదుకు కోర్టుకెక్కిన ప్రెసిడెంట్

జూబ్లిహిల్స్ లో 1519 గజాలు 1.91 లక్షల రూపాయలకు బదిలీ

ఫోర్జరీ ఓటర్ గుర్తింపు కార్డులు..దొంగ సంతకాలతో లావాదేవీ

పోలీస్ స్టేషన్ లో కేసు..ఎఫ్ఐఆర్ నమోదు చేయని అధికారులు

కోర్టును ఆశ్రయించిన నూతన కమిటీ

జూబ్లిహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లో జరిగిన భారీ కుంభకోణాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో గత కొన్ని సంవత్సరాలుగా హవా చెలాయించిన కమిటీ ఓటమి పాలవటంతో ఇందులో సాగిన కుంభకోణాలు, మోసాలను నూతన కమిటీ తవ్వుతోంది. సొసైటీ మాజీ ప్రెసిడెంట్ తుమ్మల నరేంద్ర చౌదరితోపాటు పాత కమిటీ సభ్యులు చేసిన భారీ గోల్ మాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తగా ఎన్నికైన కమిటీ ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్ డబ్ల్యూపీ10249 ఆఫ్ 2021 ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటీషన్ లో నరేంద్ర చౌదరితోపాటు పాత కమిటీ సభ్యులు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను అక్రమంగా ఎలా దొంగ మార్గంలో దక్కించుకున్నారో పేర్కొన్నారు. ఈ అక్రమాలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 25న జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇందులో పాత కమిటీ ప్రెసిడెంట్ నరేంద్ర చౌదరితోపాటు ఇతర కమిటీ సభ్యులపై కూడా ఫిర్యాదు చేశారు.

జూబ్లిహిల్స్ సొసైటీ పరిధిలోని 853 ఎఫ్ ఫ్లాట్ ను అతి తక్కువ ధరకు అక్రమంగా బదిలీ చేయించుకున్న వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇది పూర్తిగా నరేంద్ర చౌదరి , ఇతర సభ్యులు అక్రమంగా ప్రయోజనం పొందటంతోపాటు సొసైటీకి 45 కోట్ల రూపాయల మేర నష్టం చేశారని అందులో పేర్కొన్నారు. విచారణ ద్వారా ఈ అంశాలు అన్నీ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీనికి అవసరమైన వివరాలు అన్నీ కూడా పోలీసు అధికారులకు అందజేసినట్లు తమ పిటీషన్ లో పేర్కొన్నారు. అయినా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేయటంతోపాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టులో వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నయి. 1988లో బి. శిరీష అనే మైనర్ బాలికకు ప్లాట్ ఎలాట్ చేశారన్నారు. తర్వాత బి. శిరీష తన సభ్యత్వంతోపాటు ప్లాట్ ను 1991లో నవంబర్ 30న తన అక్క కూతురు అయిన శ్రీమతి సీహెచ్ శిరీషకు బదిలీ చేసిందని తెలిపారు. సొసైటీ బైలా 42 (హెచ్)ప్రకారం ఎవరైతే ప్లాట్ పొందారో ఆ వ్యక్తి బెటర్ మెంట్ ఛార్జీలు చెల్లించటంతోపాటు మూడు సంవత్సరాల్లో ఇళ్ళు నిర్మించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గత 30 సంవత్సరాల్లో ఇది జరగలేదన్నారు.

దీంతో బి. శిరీషకు జరిగిన కేటాయింపు, ఆమె నుంచి సీహెచ్ శిరీషకు జరిగిన బదలాయింపు కూడా ఆటోమేటిగ్గా రద్దు అయిపోతాయని తెలిపారు. తొలుత ఫ్లాట్ కేటాయించిన శిరీష్ అమెరికా వెళ్లి అక్కడ వ్యక్తినే పెళ్లాడి ఆమెరికా పౌరురాలుగా మారిందని తెలిపారు. ఈ సమయంలోనే తుమ్మల నరేంద్ర చౌదరితోపాటు మరికొంత కలసి ఈ ప్లాట్ లో అక్రమ నిర్మాణం చేపట్టారని, సొసైటీ సభ్యులు కూడా దీన్ని వ్యతిరేకించారన్నారు. 2020 జూన్ లో ప్రపంచం అంతా కరోనాతో అల్లకల్లోలంగా ఉన్న సమయంలో 2020 జూన్ 26న ఈ 853 ఎఫ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిపించారన్నారు. దొంగ సంతకాలతో ఇది జరిగిందని పిటీషన్ లో తెలిపారు. 1519 గజాల ఈ స్థలం అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉంటుందని, అలాంటిది ఇంత ఖరీదైన ఫ్లాట్ ను 1,91,000 రూపాయలకు బదిలీ చేయించారన్నారు. దీని వల్ల సొసైటీకి ఏకంగా 45 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

అమ్మిన వ్యక్తికి సంబంధించిన ఆధార్, పాన్ కార్డులు ఏమీ లేకుండానే ఈ లావాదేవీ జరిపించారన్నారు. మరో కీలక విశేషం ఏమిటంటే ఈ లావాదేవీకి సంబంధించిన ఈ మోసపూరిత సేల్ డీడ్ కు సంబంధించి 41 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రెసిడెంట్ తుమ్మల నరేంద్ర చౌదరి ఎస్ బిఐ చలానా నెం. 2709833396403 ద్వారా చెల్లింపులు చేశారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత సంతకాల పరిశీలించగా ఒక సంతకానికి , మరో సంతకానికి సంబంధం లేకుండా ఉన్నాయని తెలిపారు. ఈ అంశాలు అన్నీ పరిశీలించి తుమ్మల నరేంద్ర చౌదరితోపాటు ఇతర కమిటీ సభ్యుల మోసాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా కమిషనర్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసులకు ఆదేశాలు ఇస్తూ న్యాయం చేయాలని కోరారు.

Next Story
Share it