Telugu Gateway
Telugugateway Exclusives

కెటీఆర్ వ్యాఖ్య‌లు..టీఆర్ఎస్ కు లాభ‌మా..న‌ష్ట‌మా?!

కెటీఆర్ వ్యాఖ్య‌లు..టీఆర్ఎస్ కు లాభ‌మా..న‌ష్ట‌మా?!
X

రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ శుక్ర‌వారం నాడు క్రెడాయ్ స‌మావేశంలో ఏపీపై చేసిన వ్యాఖ్య‌లు ఒక్క‌సారిగా రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపాయి. ఏపీలో విద్యుత్ లేదు..నీళ్ళు లేవు..రోడ్ల‌న్నీ విధ్వంసం అయ్యాయ‌ని త‌న మిత్రుడు ఒక‌రు చెప్పార‌న్నారు. కావాలంటే వెళ్లి చూసి వ‌చ్చినా వాస్త‌వాలు తెలుస్తాయ‌ని..దేశంలోనే హైద‌రాబాద్ లో అత్యుత్త‌మ మౌలిక‌స‌దుపాయాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఏపీ గురించి కెటీఆర్ చెప్పిన అంశాల్లో చాలా వ‌ర‌కూ వాస్త‌వాలే అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వాస్త‌వాలు చెపితే ఎవ‌రు ఒప్పుకుంటారు..ఎవ‌రు అంగీక‌రిస్తారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే కెటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా టీఆర్ఎస్ కు లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ చేస్తాయ‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ల మ‌ధ్య స‌త్సంబంధాలు ఉన్నాయి. అంతే కాదు..ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ కు తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కెసీఆర్ సాయం చేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రిగింది. తర్వాత ఇద్ద‌రు సీఎంలు క‌ల‌సి ఓ భారీ ఉమ్మ‌డి సాగునీటి ప్రాజెక్టు కూడా త‌ల‌పెట్టారు.ఈ ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న స‌మ‌యంలోనే అసెంబ్లీ వేదిక‌గా తెలంగాణ సీఎం కెసీఆర్ ఎంతో ఉదారంగా వ్య‌వ‌హ‌రించార‌ని..ఇద్ద‌రు సీఎంలు స‌ఖ్య‌త‌గా ఉంటే మీకెందుకు బాధ అంటూ టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు కూడా. కానీ త‌ర్వాత ఆ ప్రాజెక్టు ముందుకు సాగ‌లేదు.

తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా ఓ మీడియా స‌మావేశంలో మీరు ఎంత ప్ర‌య‌త్నించినా..జ‌గ‌న్ కు..త‌న‌కు గొడ‌వ‌లు పెట్ట‌లేరంటూ ఓ జ‌ర్న‌లిస్టుపై ప్ర‌తినిధిపై మండిప‌డ్డారు. ఇది అంతా ప‌క్క‌న పెడితే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అనుకూలురు..ఏపీకి చెందిన వారు చాలా మంది టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓట్లు వేసిన‌ట్లు విశ్లేష‌ణ‌లు వెలుగుచూశాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి ప్రాభల్యం ఉన్న చాలా చోట్ల టీఆర్ఎస్ గెలుపొంద‌గా..స్థానికులు...పూర్తి స్థాయిలో తెలంగాణ ప్ర‌జ‌లు ఉన్న ప్రాంతాల్లో బిజెపి అనూహ్య విజ‌యం సాధించింది. ఈ లెక్క‌న ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌లు ముఖ్యంగా వైసీపీ, జ‌గ‌న్ అభిమానులు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపిన‌ట్లు లెక్క‌లు వేశారు. తాజాగా కెటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఏపీ మంత్రులు..వైసీపీ, జ‌గ‌న్ అభిమానులు టీఆర్ఎస్ పై, మంత్రి కెటీఆర్ పై విమ‌ర్శ‌ల దాడి ప్రారంభించారు. ఇది అంతిమంగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ చేస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ప‌లు సంద‌ర్భాల్లో సీఎం కెసీఆర్ తోపాటు తెలంగాణ మంత్రులు కూడా ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రియ‌ల్ ఎస్టేట్, విద్యుత్ , పారిశ్రామిక అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ త‌మ‌ను విమ‌ర్శించిన వారే గోతిలో ప‌డ్డారంటూ వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it