పీకె ట్యూన్స్ కు ..ఇక టీఆర్ఎస్ డ్యాన్స్!
'కాంగ్రెస్ వాళ్ళు అయితే ఢిల్లీ లో సలాం కొట్టాలి. బిజెపి వాళ్లు అయితే గుజరాతీ గులాంలు. మాకు ప్రజలే బాస్ లు. మేం తెలంగాణ ప్రజలు తప్ప ఎవరి మాటా వినాల్సిన పని లేదు.' ఇదీ ఇంత కాలం టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ లు చెప్పుకుంటూ వచ్చిన మాటలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బీహార్ కు చెందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఆయన కంపెనీ ఐప్యాక్ ఇచ్చే ట్యూన్స్ కు అనుగుణంగా అధికార టీఆర్ఎస్ ఇప్పుడు డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి. ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది..అభ్యర్ధులను మార్చాలి అంటే మార్చాల్సి రావొచ్చు. ప్రచారం అలా కాదు..ఇలా చేయాలి అంటే చేయాల్సిందే. ప్రశాంత్ కిషోర్ కు ప్రజల పల్స్ బాగా తెలుసు అని..ఆయన సర్వేలు పక్కాగా ఉంటాయని సీఎం కెసీఆర్ కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో పీకె కు సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పీకె నా బెస్ట్ ఫ్రెండ్..ఆయన ఫ్రీగానే పనిచేస్తారని కెసీఆర్ చెప్పినా పీకే సేవలు ఎంత ఖరీదైన వ్యవహారమో రాజకీయ పార్టీల నేతలు అందరికీ తెలుసు. తెలంగాణలో మూడవ సారి గెలుపు కోసం టీఆర్ఎస్ ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకుంది అంటేనే..నైతికంగా టీఆర్ఎస్ ముందస్తుగానే ఓటమిని అంగీకరించినట్లు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఓ వైపు మా పాలన దేశానికి ఆదర్శం అంటారు..ప్రధాని మోడీనే మా పథకాలు కాపీ కొట్టారు అని చెప్పుకుంటారు. దేశంలో ఎక్కడలేని పథకాలు అమలు చేశామని చెప్పుకునే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా తామే చేశామని చెప్పుకునే పార్టీ ఇలా ఓ వ్యూహకర్త మీద ఆధారపడాల్సిన అవసరం ఎందుకొచ్చింది?.. ఇప్పటివరకూ పని చేసిన తమ వ్యూహాలు మళ్లీ వర్కవుట్ కావని కెసీఆర్, కెటీఆర్ భావిస్తున్నారా అన్న చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో కూడా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి నడిపించిన..తెలంగాణలో ప్రతి అడుగు తెలిసిన కెసీఆర్ ఎన్నికల కోసం వ్యూహకర్తను నియమించుకోవటం అంటేనే ఆ పార్టీకి మైనస్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీలో సలామ్ చేయాలి..బిజెపి నేతలను గుజరాత్ గులాంలు అంటూ విమర్శించిన వారే ఇప్పుడు బీహార్ కు చెందిన ఓ వ్యూహకర్త మీద గెలుపునకు ఆధారపడటం అంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.