ఎమ్మెల్యేలు వద్దన్న వారినే కార్పొరేటర్లుగా బరిలో దింపిన టీఆర్ఎస్
అధికార టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయనున్న నిర్ణయం
చాలా చోట్ల ఎమ్మెల్యేల సహాయనిరాకరణ!
ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం
అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ అభ్యర్ధులుగా సిఫారసు చేసింది వేరేవాళ్లను. కానీ టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది వేరేవాళ్ళను. నగరంలోని చాలా మంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో కార్పొరేటర్లను మార్చాలని పట్టుపట్టారు. కానీ అందుకు అధిష్టానం అంగీకరించలేదు. దీనికి కారణం వాళ్లు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారని..అందుకే మార్చటం సాధ్యంకాదని కుండబద్దలు కొట్టారు.దీంతో చాలా చోట్ల పాత వాళ్ళే అభ్యర్ధులుగా బరిలో నిలిచారు. మరి తాము వద్దన్న వారిని పెడితే ఎమ్మెల్యేలు వాళ్లకు మనస్పూర్తిగా సహకరిస్తారా?. గెలుపునకు తమ వంతు సాయం అందిస్తారా?. అంటే ఇప్పుడు ఇదే పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. పలు చోట్ల తమ అభిమతానికి వ్యతిరేకంగా పార్టీ బరిలో నిలిపిన వారి విషయంలో చాలా చోట్ల ఎమ్మెల్యేలు అసలు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని..ఒక వేళ వచ్చినా కూడా ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు తప్ప..మనస్పూర్తిగా వారి గెలుపునకు ఏ మాత్రం సహకరించటంలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇది ఖచ్చితంగా కొంత మంది గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. తాము సూచించిన అభ్యర్ధులు అయితే తమ చెప్పుచేతల్లో ఉంటారని , అలా కాకుండా పార్టీ పెట్టిన వారు అయితే భవిష్యత్ లో తమకు సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందనే కారణంగా ఎమ్మెల్యేలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఇది కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. కో ఆప్షన్ సభ్యులతో ఎలాగైనా టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చేమో కానీ..రాజకీయంగా జరుగుతున్న నష్టం మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుందని ఆ పార్టీ వర్గాల్లోనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూలేని రీతిలో బిజెపి ఊహించని స్థాయిలో సవాళ్ళు విసురుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.