Telugu Gateway
Telugugateway Exclusives

ప్ర‌జ‌లే మా బ‌లం అనే ద‌గ్గ‌ర నుంచి..పీకెనే మా బ‌లం అనేదాకా!?

ప్ర‌జ‌లే మా బ‌లం అనే ద‌గ్గ‌ర నుంచి..పీకెనే మా బ‌లం అనేదాకా!?
X

'తెలంగాణ ప్ర‌జ‌లే మా బాస్ లు. మా బ‌లం. మాకూ ఢిల్లీలో ఎవ‌రూ బాస్ లు లేరు. మా సంక్షేమ కార్య‌క్ర‌మాలు దేశానికే ఆద‌ర్శం. దేశంలో ఎక్క‌డా జ‌ర‌గ‌ని అభివృద్ధి తెలంగాణ‌లో జ‌రుగుతోంది' అని చెప్పుకునే టీఆర్ఎస్ అగ్ర‌నాయ‌క‌త్వం ఇప్పుడు ఎన్నిక‌ల కోసం..వ్యూహాల కోసం ప్ర‌శాంత్ కిషోర్ అనే వ్య‌క్తిని తెచ్చుకుంది. ఆయ‌న ఇందుకు కోట్ల‌కు కోట్లు ఛార్జ్ చేస్తాడ‌నే విష‌యం తెలిసిందే. ఎందుకంటే దేశంలో చాలా పార్టీలు ఆయ‌న సేవ‌లు ఉప‌యోగించుకుంటాయి. చాలా పార్టీల క‌థ వేరు..తెలంగాణ‌లో టీఆర్ఎస్ క‌థ వేరు. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ‌సాధ‌న‌లో టీఆర్ఎస్, కెసీఆర్ ముందుండి న‌డిపించారు. అందుకే రెండు సార్లు ఆ పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. ఈ త‌రుణంలో టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం పీకె సేవ‌లు ఉప‌యోగించుకోవ‌టానికి రెడీ అవ్వ‌టంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతూ చూస్తున్నారు. దేశానికి కొత్త రాజ్యాంగం అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌క‌టించిన కెసీఆర్..త‌మ పార్టీ గెలుపు కోసం పీకె సేవ‌లు ఉప‌యోగించుకోవ‌టం అనేది ఒక ర‌కంగా రాజ‌కీయంగా ఆయ‌న‌కు మైన‌సే అవుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇప్పుడు ఎలాంటి అనుమానాల‌కు ఆస్కారం లేకుండా ప్రశాంత్ కిషోర్ నేరుగా తెలంగాణ‌లో రంగంలోకి దిగారు.

పీకె ఆదివారం నాడు ఎర్ర‌వెల్లి పాంహౌస్ లో సీఎం కెసీఆర్ తో సుదీర్ఘంగా భేటీ అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అంతే కాదు..ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో గ‌జ్వేల్ తోపాటు కాళేశ్వ‌రం త‌దిత‌ర ప్రాజెక్టుల‌ను ప్ర‌కాష్ రాజ్ తో క‌ల‌సి పరిశీలించారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకోవ‌టానికి పీకె టీమ్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోనున్న‌ట్లు చెబుతున్నారు. కానీ ముఖ్య‌మంత్రి కెసీఆర్ గ‌త ఎన్నిక‌ల‌ప్పుడూ..ఇప్పుడు కూడా ఏదైనా బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడితే ప్ర‌భుత్వం ఏమి చేసిందో మీ కళ్ళ ముందు ఉంది..మీరు ఇంటికి వెళ్లి అంద‌రితో క‌ల‌సి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోండి అని చెబుతూ ఉంటారు. కెసీఆర్ చెప్పిన‌ట్లే టీఆర్ఎస్ చేసింది క‌ళ్ల ముందు నుంచి ఎవ‌రూ తీసేయ‌లేరు..చేయ‌నిది ఎవ‌రూ తీసుకొచ్చి ముందు పెట్ట‌లేరు.

అలాంటిది ఇప్పుడు కెసీఆర్, కెటీఆర్ ల మించి ప్ర‌శాంత్ కిషోర్ అండ్ టీమ్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా ఏమి చెబుతారు?. ఇప్పుడు టీఆర్ఎస్ కు అతి పెద్ద స‌వాల్ అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల కంటే సీఎం కెసీఆర్ విశ్వ‌స‌నీయ‌త అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని ఓ సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు.. ఎందుకంటే చెప్పేదానికి చేసేదానికి మ‌ధ్య తేడా భారీగా ఉండ‌టంతోనే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌ను సంబంధించి అవిగో..ఇవిగో అంటూ ఏడాదిన్న‌ర నుంచి ఊరించ‌ట‌మే త‌ప్ప‌.. ఆ లెక్క తేల‌దు...అవి బ‌య‌ట‌కు రావు. అంతే కాదు..ప‌లు కీల‌క హామీల విష‌యంలో కూడా దాట‌వేత వైఖ‌రి..ఆ క్షణానికి..అవ‌స‌రానికి ఏదో ఒక‌టి చెప్పి పనికానిచ్చేసుకోవ‌టం..త‌ర్వాత వాటిని పూర్తిగా విస్మ‌రించ‌టం వంటివి ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్ర‌తికూలాంశాలుగా మారాయని సొంత పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పీకె సేవ‌లు తెలంగాణ కోస‌మే కాదు..కెసీఆర్ ఫోక‌స్ పెట్టిన జాతీయ రాజ‌కీయాల కోసం కూడా అని టీఆర్ఎస్ క‌వ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని..ఈ అంశాన్ని ఇప్ప‌టికే ప్ర‌చారంలో పెట్టారంటున్నారు.

Next Story
Share it