కెసీఆర్ కు సభలో ఈటెలను చూడటం ఇష్టం లేకనేనా?!
అనూహ్యం. అసాధారణ నిర్ణయం. అసలు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన అరగంట కూడా పూర్తి కాకుండానే ఏకంగా ముగ్గురు బిజెపి శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులు ఉన్నారు. డ్జెట్ ప్రసంగానికి వాళ్లు అడ్డం పడితే సహజంగా ఆ సెషన్ వరకూ సస్పెండ్ చేస్తారు. అది ఎప్పుడైనా జరిగేదే. కానీ అసలు ఎన్ని రోజులు సమావేశాలు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే బీఏసీ జరగాలి..సమావేశాల తేదీలను ఖరారు చేయాలి. కానీ అదేమి లేకుండానే ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు అంటే..సీఎం కెసీఆర్ కు సభలో ఈటెల రాజేందర్ ను చూడటం ఇష్టలేకనే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏకంగా సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసేంత తీవ్రమైన పనులు వీరు ముగ్గురు సభలో ఏమి చేశారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ ఎప్పటి నుంచో కాస్త ప్రభుత్వ తీరుపై గట్టిగా మాట్లాడితే వాళ్లను సభ నుంచి సస్పెండ్ చేస్తూ వస్తుంది.
అలాగే సోమవారం నాడు ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. సెకన్లలో ఆమోదం జరిగిపోయింది. ఈ పరిణామం చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అంటే సభలో అయినా..బయట అయినా ఏ మాత్రం వ్యతిరేకతను కూడా ప్రభుత్వం స్వాగతించే పరిస్థితి కన్పించటంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శాసనసభ వేదికగా బిజెపిపై ముఖ్యంగా కేంద్రంపై విమర్శలు చేయాలనే యోచనలో టీఆర్ఎస్ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు ప్రారంభించటమే ఇప్పటికే దుమారం రేపుతోంది. సహజంగా ఈబిజెపి ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంటుంది. వీళ్లను సస్పెండ్ చేయటం ద్వారా చెక్ పెట్టినట్లు అవుతుంది. బిజెపి ఎమ్మెల్యే సస్పెన్షన్ విషయంలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందో వేచిచూడాల్సిందే.