Telugu Gateway
Telugugateway Exclusives

కెసీఆర్ అప్పుడే వాళ్ల‌కు 'టోపీ పెట్టారు'

కెసీఆర్ అప్పుడే వాళ్ల‌కు టోపీ పెట్టారు
X

వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికి క్లారిటీ లేదు. అస‌లు సీఎం కెసీఆర్ తో క‌లిసొచ్చేది ఎవ‌రో కూడా తెలియ‌దు. టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కెసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై పూట‌కో మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళంలోకి నెడుతున్నారు. జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తామ‌ని ఎప్పుడో ప్ర‌క‌టించిన ఆయ‌న ఎక్క‌డ మీటింగ్ పెడితే అక్క‌డ మీరు వెళ్ల‌మంటారా అని ప్ర‌జ‌ల‌ను అడ‌గటం..ఓకే మీరు వెళ్ల‌మంటున్నారు కాబ‌ట్టి వెళ‌తా అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. 2024 ఎన్నిక‌ల త‌ర్వాత కేంద్రంలో వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే అంటూ ప్ర‌కటించారు. ముందు నాన్ బిజెపి ప్ర‌భుత్వం అని ప్ర‌క‌టించి..త‌ర్వాత మ‌న ప్ర‌భుత్వం అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో ఉన్న‌దే 17 ఎంపీ సీట్లు...ఏదో చ‌ర్చ‌కు మొత్తం టీఆర్ఎస్ కు వ‌స్తాయ‌ని అనుకుందాం కాసేపు. ఈ సీట్ల‌తోనే కెసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వంలో చ‌క్రం తిప్పుతారా?. అంతే కాదు..ఎవ‌రు భాగ‌స్వాములుగా ఉంటారో..ఎవ‌రు లీడ్ చేస్తారో తెలియ‌కుండానే ఆయ‌న అత్యంత కీల‌క‌మైన దేశ‌మంత‌టికీ రైతుల‌కు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. స‌హ‌జంగా రైతుల హామీ కాబ‌ట్టి ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌క‌పోవ‌చ్చు. కానీ కెసీఆర్ తీరు ఖ‌చ్చితంగా మిగిలిన పార్టీల‌ను..అస‌లు కెసీఆర్ తో క‌ల‌వాల‌నే ఆలోచన ఉన్న‌వారిని కూడా ఈ ప‌రిణామంతో దూరం చేసే అవ‌కాశం ఉంది. బిజెపి ముక్త్ భార‌త్ అనేది కెసీఆర్ ఒక్క‌రితో అయ్యే ప‌ని కాదు.

ముఖ్యంగా కాంగ్రెస్ లేకుండా ఇది అస‌లు జ‌ర‌గ‌దు. కాంగ్రెస్ తోపాటు కీలక పార్టీలు అన్నీ ఉమ్మ‌డిగా ..ఏక‌తాటిపై న‌డిస్తేనే ఓ ప్ర‌య‌త్నం చేయోచ్చు. అది ప‌లితం ఇస్తుందా లేదా అన్న‌ది త‌ర్వాత సంగ‌తి. కానీ సీఎం కెసీఆర్ ఏక‌ప‌క్షంగా దేశ‌మంత‌టా రైతుల‌కు ఉచిత విద్యుత్ హామీ ప్ర‌కటిస్తే మిగిలిన పార్టీలు అన్నీ కెసీఆర్ ది గ్రేట్ అంటూ ఆయ‌న‌తో క‌ల‌సివ‌స్తారా?. పోనీ ఉచిత విద్యుత్ ప‌థ‌కం ఏమైనా కెసీఆర్ మాన‌స పుత్రికా అంటే అదీ కాదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ స్కీమ్ ను తెర‌పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయ‌నే ఏదో దీని రూప‌శిల్పిలా మాట్లాడ‌టం ..జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి దేశ‌మంత‌టా దీన్ని అమ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌టం ద్వారా కెసీఆర్ తొంద‌ర‌పాటు ప్ర‌క‌ట‌న చేశార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చిన 28 రాష్ట్రాల‌కు చెందిన రైతు నాయకులు త‌న‌ను జాతీయ రాజ‌కీయాల్లోకి ఆహ్వానించారు..తెలంగాణ‌కు మీరు బాగా చేశారు..దేశం గురించి కూడా ఆలోచించాల‌ని కోరారంటూ నిజామాబాద్ స‌భ‌లో కెసీఆర్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. 1.20 ల‌క్షల కోట్లు ఖ‌ర్చు చేస్తే దేశ‌మంతా రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చ‌ని ప్ర‌కటించారు. ఎన్ పీఏల కింద 12 ల‌క్షల కోట్లు బ‌డా బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ర‌ద్దు చేశార‌ని కెసీఆర్ ఆరోపించారు.

Next Story
Share it