పోసానిని పిలిచారు..మరి మంచు విష్ణు ఎక్కడ?
టాలీవుడ్ కు చెందిన పలు అంశాలు చర్చించేందుకు సీఎం జగన్ దగ్గర గురువారం నాడు జరిగిన సమావేశంలో సినీ ప్రముఖులతోపాటు పోసాని క్రిష్ణమురళీ కూడా పాల్గొన్నారు. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణుకు మాత్రం ఆహ్వానం ఉన్నట్లు కన్పించటం లేదు. ఆయన ఇటీవలే పరిశ్రమ అందరిది అని..ఏ కొంత మందిదో కాదని వ్యాఖ్యానించారు. కానీ సీఎం జగన్ దగ్గర మీటింగ్ కు చిరంజీవితోపాటు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నారాయణమూర్తి, అలీ, పోసాని పాల్గొన్నారు.
కానీ విచిత్రంగా మా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, మరో సీనియర్ నటుడు మోహన్ బాబును కూడా ఆహ్వానించలేదు. విజయవాడ బయలుదేరే ముందు చిరంజీవి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ సమావేశం పూర్తిగా ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగిందని స్పష్టం అవుతోంది. సీఎం జగన్ దగ్గర నుంచి తనకు ఆహ్వానం అందిందని..ఎవరెవరు వస్తున్నారో తనకు తెలియదు అని చిరంజీవి వ్యాఖ్యానించారు. అంటే ఇది పరిశ్రమ తరపున తీసుకున్న చొరవ కాదు..సీఎంవో నుంచి అందిన పిలుపుల మేరకే వీరు హాజరైనట్లు స్పష్టం అవుతోంది. దీంతో మరి మోహన్ బాబు ఫ్యామిలీని జగన్ ఎందుకు దూరం పెట్టినట్లు అనే అంశంపై చర్చ నడుస్తోంది.