Top
Telugu Gateway

టీడీపీ..బిజెపికి 'తిరుపతి ఉప ఎన్నిక సంకటం '

టీడీపీ..బిజెపికి తిరుపతి ఉప ఎన్నిక సంకటం
X

మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ కొట్టిన దెబ్బ ఏపీలో ప్రతిపక్షాలను దిమ్మతిరిగేలా చేసింది. ఏ పార్టీకి ఎంత వేవ్ ఉన్నా కనీసం కీలక నేతల జిల్లాల్లోనైనా ...నియోజకవర్గాల్లో పట్టు మాత్రం నిలుపుకుంటారు. ఇది సహజంగా జరిగేది. కానీ ఈ సారి ఎక్కడా ఆ సీన్ కన్పించలేదు. చంద్రబాబు..పవన్ కళ్యాణ్..సోము వీర్రాజు ఎవరి ప్రభావం కన్పించకుండా అన్ని చోట్లా వైసీపీ ఊడ్చేసింది. దీంతో త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నిక వైపు అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బిజెపికి అసలు డిపాజిట్లు వస్తాయా?. బిజెపి అభ్యర్ధిగా ప్రచారం జరుగుతున్న రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు అసలు బరిలో నిలుస్తారా?. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తిరుపతిలో బిజెపి తరపున నిలిచిన అభ్యర్ధులకు పోలైన ఓట్లు చూసి అందరూ అవాక్కు అవుతున్నారు. అంతే కాదు..తిరుపతి సీటు బిజెపికే ఇరుపక్షాలు ప్రకటించిన తర్వాత ఈ లోక్ సభ పరిధిలోని జనసేన అభిమానులు సమావేశం పెట్టుకుని ' నోటా'కు అయినా వేస్తాం కానీ...బిజెపికి మాత్రం వేయకూడదని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

తిరుపతి లోక్ సభ సీటు గెలిపిస్తే కేంద్ర మంత్రి అని ప్రచారం చేస్తారంట బిజెపి నేతలు. ఏపీకి ఇవ్వాల్సిన విభజన హామీలు అన్నీ తుంగలో తొక్కి..మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుని..మా ఎంపీని గెలిపించండి..మేం కేంద్ర మంత్రి పదవి ఇచ్చుకుంటాం అంటే ప్రజలు ఓట్లు వేస్తారా?. ఇది జరిగే పనేనా?. బిజెపి సంగతి ఇలా ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. ఆ పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్ధి పనబాక లక్ష్మీ అని ఎప్పుడో ప్రకటించింది. కానీ ఆమె అసలు ఈ విషయాన్ని పట్టించుకోవటం మానేసి చాలా కాలమే అయింది. వరసగా జరిగిన పంచాయతీ ఎన్నికలు,,తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత పనబాక లక్ష్మీ అసలు బరిలో ఉండే ఛాన్సేలేదని చెబుతున్నారు. దీంతో టీడీపీ మరో కొత్త అభ్యర్ధిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

మరో విచిత్రం ఏమిటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన, ప్రతిపక్ష నేతగా కూడా రికార్డు సమయం పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు...జిల్లా సంగతి వదిలేయండి..సొంత నియోజకవర్గం కుప్పంలోనే దారుణ పరాభవాన్ని చవిచూశారు. అంతే కాదు..అధికారంలో ఉండగా మంత్రులుగా పెత్తనం చెలాయించిన వారంతా ఇప్పుడు మొహం చాటేసి తిరుగుతున్నారు. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే కనీసం బరిలో నిలబడి పోటీకి సై అన్న సవాల్ కూడా విసరలేకపోయారు చాలా మంది. ప్రస్తుతం టీడీపీ క్యాడర్ కంటే నాయకులు చాలా మంది డీలాపడిపోయి ఉన్నారని..మరికొంత మంది ఇప్పుడే మనకు ప్రభుత్వం గొడవ ఎందుకు అని మౌనంగా ఎవరి పని వారు చేసుకుంటున్నారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it