Telugu Gateway
Telugugateway Exclusives

మూడు వంద‌ల అర‌వైదు గ‌జాలు...ముగ్గురు రిపోర్ట‌ర్లు

మూడు వంద‌ల అర‌వైదు గ‌జాలు...ముగ్గురు రిపోర్ట‌ర్లు
X

స‌హ‌జంగా ముఖ్య‌మంత్రి మీడియా స‌మావేశానికి కూడా ఒక్క‌రే సీనియ‌ర్ రిపొర్ట‌ర్ వెళ‌తారు. ఎల‌క్ట్రానిక్ మీడియా వ‌చ్చాక లైవ్ లు వ‌చ్చి రిపొర్టింగ్ మ‌రింత సుల‌భం అయింది. ఇది మీడియాలో ఉన్న వారంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఓ 365 గజాల వివాదానికి సంబంధించి మీడియా స‌మావేశానికి ఓ ఛాన‌ల్ నుంచి ఏకంగా ముగ్గురు ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఈ ప్లాట్ వివాదంపై కేసు అయితే న‌మోదు అయింది..అది అక్ర‌మ‌మా?..స‌క్ర‌మ‌మా అన్న‌ది కోర్టులు తేలుస్తాయి. దీనిపైనే క‌మిటీ నిన్న వివ‌ర‌ణ ఇచ్చింది. అంతా ప‌ద్ద‌తి ప్ర‌కార‌మే అని ప్ర‌క‌టించింది. కానీ ఆ ఛాన‌ల్ నుంచి ఈ మీడియా సమావేశానికి ఏకంగా ముగ్గురు ప్ర‌తినిధులు వ‌చ్చారంటే ఆ యాజ‌మాన్యం ఎంత ఆత్మ‌ర‌క్షణ‌లో ఉందో అర్ధం అవుతుంద‌నే వ్యాఖ్య‌లు మీడియా స‌ర్కిళ్ల నుంచి వ‌స్తున్నాయి. నిజానికి ఇప్ప‌టి సొసైటీలోని వాళ్లు త‌ప్పుచేసినా చేతిలో ఛాన‌ల్ ఉంది కాబట్టి అక్ర‌మాలు బ‌హిర్గ‌తం చేయ‌వ‌చ్చు. ప‌దే ప‌దే ప్రసారం చేయ‌వ‌చ్చు. ఎందుకంటే చీమ చిటుక్కుమ‌న్నా వాళ్ళ‌కు ఎలాగూ స‌మాచారం వ‌స్తుంది. అయితే అక్క‌డ ప‌రిస్థితి చూస్తే కొత్త‌ త‌ప్పు కంటే వాళ్ల పాత త‌ప్పులు ఎక్క‌డ బ‌హిర్గ‌తం అవుతాయో అన్న టెన్ష‌నే ఎక్కువ ఉంది.

అందుకే ఈ తిప్ప‌లు. ఎవరో చేసిన త‌ప్పుల‌కు ఉద్యోగం చేస్తున్నందున మ‌ధ్యలో రిపొర్ట‌ర్ల‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌టం లేదు. గ‌త క‌మిటీ అక్ర‌మాలు అన్నీ త‌వ్వితీసే ప‌నిలో కొత్త క‌మిటీ ఉంది. అందులో ఛాన‌ల్ లో కొంత కాలం పాటు వాటా ఉన్న ఆయ‌న‌కు సంబంధించిన మెగా డీల్ కూడా ఉంది. ఈ మెగానుభావుడికి 2000 సంవ‌త్సరంలో చేసి డీల్ చూస్తే ఎవ‌రైనా క‌ళ్ళు తిరిగి ప‌డిపోవాల్సిందే. ఈ కేసులు అన్నీ క‌లుపుకుంటే వంద‌ల కోట్ల రూపాయ‌లు చేతులు మారిన‌ట్లు చెబుతున్నారు. గ‌త పాల‌క మండ‌లి ఏకంగా ఏభైకి పైగా కేసుల్లో భారీ ఎత్తున వ‌సూళ్ళ‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. ఈ పేర్లు ఏమైనా కొత్త క‌మిటీ సోమ‌వారం నాటి స‌మావేశంలో బ‌హిర్గ‌తం చేస్తుందేమో అన్న‌ టెన్ష‌న్ లో ఈ ఛాన‌ల్ వాళ్ళు ఉన్నారు. ఆ జాబితా అంతా ప‌క్కాగా త‌యారైన త‌ర్వాత ఇవి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ జాబితా సిద్ధం అయింద‌ని స‌మాచారం. రాబోయే రోజుల్లో ఈ వ్య‌వ‌హ‌రం మ‌రింత రంజుగా మార‌టం ఖాయంగా క‌న్పిస్తోంది.

Next Story
Share it