జీహెచ్ఎంసీ ఎన్నికలకూ వరస సెలవులు
ఓటింగ్ పై ప్రభావం తప్పదా?
అంతా సవ్యంగా ఉన్నప్పుడే జీహెచ్ఎంసీలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి ఓ వైపు కోవిడ్. మరో వైపు వరస సెలవులు. మరి ఈ ఎన్నికల్లో ఓటింగ్ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. అసలు ఎన్నికల తేదీని ఖరారు చేసే ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదా?. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఎన్నికల తేదీని ఫిక్స్ చేయాలి కదా?. కానీ ఈ సారి కూడా అలా జరగలేదు. ఓటింగ్ తేదీ సెలవును కూడా కలుపుకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వరసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఆదివారం సాధారణ సెలవు. సోమవారం నాడు కార్తీక పౌర్ణమి సెలవు. మంగళవారం నాడు అంటే డిసెంబర్ 1న ఎన్నికల సెలవు. దీంతో వరసగా మూడు రోజుల సెలవులు వచ్చాయి. సహజంగా నగర ప్రజలు ఏ రోజూ ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదని గత అనుభవాలు చెబుతున్నాయి. అయినా సరే ఎస్ఈసీ ఈ సంగతిని విస్మరించి ఎన్నికల తేదీని ఫిక్స్ చేసినట్లు కన్పిస్తోంది. వరసగా మూడు రోజుల సెలవులు అంటే ఎక్కువ మంది యూత్ ఈ సెలవులను ఏదో టూర్లకు సద్వినియోగం చేసుకుందాం అనుకుంటారు.
అంతే తప్ప బాధ్యతగా ఓటు వేయాలనే ఆలోచన ఉండేది అతి తక్కువ మందిలో మాత్రమే. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ 80 శాతం వరకూ ఉంటుంటే పట్టణ ప్రాంతాల్లో మాత్రం 40 నుంచి 45 శాతం దాటడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో వాస్తవం ఉంది. ఓటింగ్ లో పాల్గొనని వారికి ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు కూడా ఉండదన్నారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయారు. ఈ సారి కూడా వరసగా మూడు రోజుల సెలవులు వచ్చాయి..మరి ఈ సారి ఓటింగ్ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ఐటి ఉద్యోగులకు అయితే ఈ సెలవులు నాలుగు రోజులు.