Telugu Gateway
Telugugateway Exclusives

హైదరాబాద్ ను 'నివర్' కవర్ చేస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి?!

హైదరాబాద్ ను నివర్ కవర్ చేస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి?!
X

టెన్షన్ టెన్షన్ లో గ్రేటర్ అధికార పార్టీ అభ్యర్ధులు

అధికార టీఆర్ఎస్ ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీల కంటే 'వర్షానికి' ఎక్కువ భయపడాల్సిన పరిస్థితి. ఓ వైపు బిజెపి దుబ్బాక జోష్ లో దూసుకొస్తోంది. ఊహించని స్థాయిలో ఆ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు దక్కించుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో హైదరాబాద్ కూ 'నివర్' ఎఫెక్ట్' పడింది. అసలే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాలు ఆగమాగం అయ్యియి. పెద్ద ఎత్తున ఇళ్ళు నీట మునిగాయి. ప్రజలు నానా అవస్థలు పడ్డారు. గత వందేళ్లలో ఎప్పుడూ పడని వర్షాలు పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అధికార టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఈ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేతలు అందరూ పదే పదే వరదల అంశాన్ని లేవనెత్తుతున్నారు. తాజాగా వచ్చిన భయంకర వరదల గురించి ఇంకా ఎవరూ మర్చిపోకముందే హైదరాబాద్ ను ముసురు కమ్ముకుంది. గురువారం రాత్రి నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడటం ప్రారంభం అయ్యాయి. శుక్రవారం అంతా ముసురు పట్టుకునే ఉంది. ఈ తుఫాన్ కారణంగా ఓ గంట పాటు నగరంలో భారీ వర్షం పడ్డా అధికార టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే ఆందోళనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్ధులు అయితే ఇలా చిన్నపాటి చినకులు అయితే పర్వాలేదు కానీ...భారీ వర్షం పడితే మాత్రం తమకు సమస్యలు తప్పవనే ఆందోళనలో ఉన్నారు. మరో రెండు రోజుల పాటు నగరంలో వర్షాలు పడే అవకాశం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు కొత్త తుఫాన్లు కూడా ముంచుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి అన్నీ కూడా అధికార టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిణామాలే. టీఆర్ఎస్ శనివారం నాటి సీఎం కెసీఆర్ సభపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. వర్షం ఇదే తీరుగా ఉన్నా బహిరంగ సభ సాధ్యం అవుతుందా?. జన సమీకరణ ఆశించిన స్థాయిలో సాగుతుందా అన్న సందేహంలో పార్టీ నేతలు ఉన్నారు. భారీ వర్షం పడి నీరు వస్తే ఎక్కువ ప్రభావం అధికార పార్టీ వారిపైనే ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ సభ్యులతో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకోవటంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేకపోయినా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ బలం ఎంత మేరకు బిజెపి, కాంగ్రెస్ లు తగ్గిస్తాయన్నదే అత్యంత కీలకంగ మారింది. ఎందుకంటే భవిష్యత్ తెలంగాణ రాజకీయాలకు ఇది అత్యంత కీలకం అన్న సంగతి తెలిసిందే.

Next Story
Share it