జన్ పథ్ నుంచి జనపథం లోకి
వరస ఓటములతో గత కొన్ని సంవత్సరాలుగా ఓ పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పోరాటాలు చేయాల్సిన అవశ్యకతను గుర్తించినట్లు కన్పిసోంది. ఇంత కాలం రాహుల్ గాంధీ కూడా కేంద్రంలోని మోడీ, బిజెపి ప్రభుత్వాలపై ట్విట్టర్ లో విమర్శలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఇది చాలదని..పార్టీలో సమూల మార్పులు చేయటంతోపాటు..మరింత క్రియాశీలక నాయకులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించారు. అందులో భాగంగానే సీనియర్లు, జూనియర్ల మిశ్రమం అన్నట్లు టిక్కెట్లను 50 శాతం యువతకు కేటాయించాలని ప్రతిపాదించారు. అంతే కాదు..పార్టీ పదవుల్లో కూడా 50 శాతం వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించాలని ప్రతిపాదించారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో చేసిన డిక్లరేషన్ కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగేందుకు సమాయత్తం అవుతోంది. బిజెపిని ఓడించటం ప్రాంతీయ పార్టీలతో సాధ్యంకాదని..అది కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా కేంద్రంలోని మోడీ, బిజెపి సర్కారును ఓడించాలనుకునే వారు కాంగ్రెస్ తోనే కలవాల్సి ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో అత్యంత శక్తివంతంగా ఉన్న మోడీని, బిజెపిని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో వేచిచూడాల్సిందే.