అటూ ...ఇటూ కేసుల టెన్షన్ !
టీవీ ఆన్ చేస్తే కనిపించే వార్తలు ఇవే. పత్రికల నిండా కూడా అవే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయం అంతా కేసు ల చుట్టూనే తిరుగుతోంది. గత కొన్నినెలలుగా ఇదే తంతు. తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో ఇటీవల కాలంలో బాగా హాట్ టాపిక్ గా మారిన అంశం లిక్కర్ స్కాం. ఇందులో స్వయంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపైనే తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె పలు మార్లు ఈడీ విచారణకు హాజరు అయి వచ్చారు కూడా. ఇంకా ఆ కేసు ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగానే టిఎస్ పీఎస్ సి పేపర్ లీక్ కేసు తెలంగాణ లో పెద్ద దుమారమే రేపింది. చివరకు ఏకంగా పరీక్షలు అన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ పేపర్ లీక్ కేసు పై ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, మరో వైపు ఈడీ కూడా విచారణ జరుపుతోంది. మధ్యలో టెన్త్ పేపర్ లీక్ ఘటనలు కూడా ఒకింత కలకలం రేపాయి. లిక్కర్ స్కాం లో నేరుగా సీఎం కుమార్తె కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే...టిఎస్ పీఎస్ సి పేపర్ లీక్ విషయం లో ప్రధాన పార్టీ లు అన్ని ఏకంగా సీఎంఓ తో పాటు మంత్రి కెటిఆర్ ను టార్గెట్ చేశాయి. మంత్రి కెటిఆర్ మాత్రం పేపర్ లీక్ ఘటనలకు సంభందించి బీజేపీపై విమర్శలు చేశారు.
లక్షలాది మంది విద్యార్థులకు సంబదించిన అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. లిక్కర్ స్కాం లో ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తలవంచదు..వెనక్కి తగ్గదు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణాలో పరిస్థితి ఇలా ఉంటే ...ఆంధ్ర ప్రదేశ్ లో మరో రకం అయిన కేసు ల వ్యవహారం నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వై ఎస్ వివేకా హత్య కేసు తో పాటు కోడి కత్తి కేసు ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా వై ఎస్ వివేకా హత్యకు సంబధించి ఆ పార్టీ అధినేత, సీఎం జగన్, వైసీపీ నేతలు చేసిన ప్రకటనలకు బిన్నంగా వివేకా హత్య కేసు లో సిబిఐ విచారణలో విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది అధికార వైసీపీ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరో వైపు సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసు లో పరిణామాలు కూడా వైసీపీ కి ఏ మాత్రం మింగుడుపడటం లేదు. వైసీపీ సర్కారు ఇప్పుడు ఈ రెండు విషయాలపై కౌంటర్ చేయటం ఎలా అన్న దానిపైనే ఫోకస్ పెట్టింది. వై ఎస్ వివేకా హత్య కేసు లో స్వయంగా సీఎం జగన్ సన్నిహిత కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు కోడి కత్తి కేసు లో కుట్ర లేదని ఎన్ ఐఏ కోర్ట్ లో స్పష్టం చేయటం వైసీపీ ని ఇరకాటంలోకి నెడుతోంది. రెండు ప్రభుత్వాలు మొత్తం మీద కేసు ల టెన్షన్ ఎదుర్కొంటున్నాయి.