Telugu Gateway
Telugugateway Exclusives

ఇద్దరు సీఎంలకూ ‘కేసుల టెన్షన్ ’ !

ఇద్దరు సీఎంలకూ ‘కేసుల టెన్షన్ ’ !
X

తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ లు ఒకే సారి కేసుల టెన్షన్ ఎదుర్కొంటున్నారు. అయితే వీరిద్దరికి ఆ కేసు లతో నేరు గా సంబంధం లేకపోయినా...విచిత్రంగా ఈ కేసులు రెండూ ఆయా ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవి కావటం తో రాజకీయంగా ఇవి ఎటు తిరిగి ఎటు వస్తాయో అన్న భయం ఆయా నేతల్లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈడీ ఆమెను అనుమానితురాలిగా కోర్టు లో ప్రస్తావించింది. అదే సమయంలో మరో సారి నోటీసు లు ఇచ్చి మార్చి 20 న హాజరు కావాల్సిందే అని తేల్చి చెప్పింది. ఒకప్పుడు తెలంగాణలో బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కవిత...ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాములో ఆరోపణలు ఎదుర్కోవటం...కచ్చితంగా అధికార బిఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం చేసే అంశమే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అంతర్గత సంభాషణల్లో బిఆర్ఎస్ నేతలు కూడా ఈ విషయాన్నీ అంగీకరిస్తున్నాను. ప్రచారం జరుగుతున్నట్లు ఈ కేసు లో కవిత అరెస్ట్ అంటూ జరిగితే అది ముఖ్యమంత్రి కెసిఆర్ ఇమేజ్ కు దారుణమైన దెబ్బగా మారటంతో పాటు...బిఆర్ఎస్ కూడా మైనస్ అవుతుంది అనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. రెండు సార్లు తెలంగాణ లో అధికారం చెలాయించిన బిఆర్ఎస్ సర్కారుపై ఇప్పటికే పలు వర్గాల్లో వ్యతిరేకత ఉంది. దీనికి తోడు ఇప్పుడు లిక్కర్ స్కాం లో స్వయంగా సీఎం కుమార్తె పై ఆరోపణలు రావటం మరింత నష్టానికి కారణం అవుతుంది అని చెపుతున్నారు. ఇది ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డ్డి విషయానికి వస్తే స్వయంగా అయన బాబాయ్ వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కూడా తుది దశకు చేరుకుంది. ఈ కేసు లో వైసీపీ ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి పై సిబిఐ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తాజా గా తెలంగాణ హై కోర్టు కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆపమని ఆదేశించలేమని...సిబిఐ తన విచారణతో ముందుకు పోవచ్చు అని ప్రకటించింది.

కొద్ది రోజుల క్రితమే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి తో పాటు అయన తండ్రి భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ప్రకటించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ లో ఒక కన్ను ఇంకో కన్ను ను పొడుచుకుంటుందా అని ఈ హత్య కేసు లో బయటి వ్యక్తుల ప్రమేయం తప్ప అవినాష్ రెడ్డి పాత్ర ఉండే అవకాశం లేదు అంటూ వాదించారు. సిబిఐ విచారణ తర్వాత స్వయంగా అవినాష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ వై ఎస్ వివేకా కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు ఇది అంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేయించాడు అనే తరహాలో సీఎం జగన్ ఫ్యామిలీ పత్రిక సాక్షి నారాసుర రక్త చరిత్ర అంటూ రాసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి మాత్రం అందుకు బిన్నంగా చెపుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కి వై ఎస్ వివేకా హత్య కేసు కూడా ఉపయోగ పడింది అనే ప్రచారం ఉంది. దీంతో పాటు వైజాగ్ విమానాశ్రయం లో జరిగిన కోడి కత్తి కేసు కూడా. ఆ కేసు కూడా ఇప్పటి వరకు ఏమీ తేలలేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ సీఎం జగన్ కు వై ఎస్ వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసు లు టెన్షన్ తెచ్చే అవకాశం ఉంటే..తెలంగాణ .సీఎం కెసిఆర్ కు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కాం ఇరకాటంలోకి నెట్టే ఛాన్స్ కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. మరి ఈ కీలక అంశాల్లో రాబోయే రోజుల్లో ఏమీ జరుగుతుందో చూడాలి.

.

Next Story
Share it