ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు రెండుసార్లు ఓడించారుగా!
తెలంగాణలో అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతోంది. ఇదీ పార్టీలో గత కొన్ని రోజులుగా విన్పిస్తున్న మాట . రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చినప్పటి నుంచి ఈ అంశాన్ని కొంత మంది తెరపైకి తీసుకొస్తున్నారు. కాసేపు ఇదే నిజం అనుకుందాం. మరి రేవంత్ కు ముందు ఇద్దరు ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు పీసీసీ ప్రెసిడెంట్లుగా పనిచేశారు కదా. మరి వారిద్దరూ ఎందుకు పార్టీని విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఇప్పుడు అన్యాయం జరుగుతుందని అరుస్తున్న ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు రెండుసార్లు పార్టీని ఎందుకు గెలిపించలేకపోయారు. అంటే తమకు పీసీసీ ఇస్తే తప్ప..ఎవరికి పదవి ఇచ్చినా పని చేయనివారు పార్టీలో చాలా మంది ఉంటారనే విషయం కాంగ్రెస్ రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి అవగతమే. ఇప్పుడు మూడవ సారి తెలంగాణలో రేవంత్ సారధ్యంలో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయతీరాలకు చేరుతుందా లేదా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టమే అయినా..ఇతర నేతలతో పోలిస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం చాలా మంది నేతల్లో..క్యాడర్ లో ఆశలు సజీవంగా ఉన్నాయనే విషయాన్ని ఆ పార్టీ నేతలు చాలా మంది అంగీకరిస్తారు. దీనితో విభేదించేవారు కూడా ఉంటారు. రేవంత్ సక్సెస్ అవుతారా లేదా అన్నది తేలటానికి ఇంకా చాలా సమయం ఉంది. మరి అంతకు ముందు పీసీసీ ప్రెసిడెంట్లు..ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు సాధించింది ఏమిటి?. కాంగ్రెస్ పార్టీ ఎంతో పెద్ద రిస్క్ చేసి..ఏపీలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసి కూడా 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది.
అదే సమయంలో తెలంగాణలో అత్యంత కీలకమైన బీసీ సామాజికవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా కూడా...ఒరిజినల్ కాంగ్రెస్ వాదిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య పార్టీని విజయతీరాలవైపు నడిపించటంలో విఫలం అయ్యారు.