Telugu Gateway
Telugugateway Exclusives

అంటే చంద్రబాబు, వైఎస్ మోడల్స్ కెసిఆర్ కాపీ కొట్టినట్లేగా!

అంటే చంద్రబాబు, వైఎస్ మోడల్స్ కెసిఆర్ కాపీ కొట్టినట్లేగా!
X

మరి బిఆర్ఎస్ కొత్త మోడల్ ఏంటి...దీన్ని ఇతరులు కాపీ కొట్టడం ఏంటి?

కెటిఆర్ వ్యాఖ్యలు బిఆర్ఎస్ కు నష్టం అంటున్న పార్టీ నేతలు

అంటే చంద్రబాబు, వైఎస్ మోడల్స్ కెసిఆర్ కాపీ కొట్టినట్లేగా!

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కామెంట్స్ అధికార పార్టీలో ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎవరి పేర్లు చెప్పి తెలంగాణ ప్రజల్లో కసి పెంచారో ఇప్పుడు వాళ్లిద్దరూ చేసిన పనులూ రెండు కలిపి కెసిఆర్ చేస్తున్నారు అని చెప్పటం అంటే అది రాజకీయంగా తమకు పెద్ద మైనస్ గా మారటం ఖాయం అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంత కాలం సీఎం కెసిఆర్ తో పాటు మంత్రి కెటిఆర్, ఇతర నేతలు కూడా తెలంగాణ మోడల్...తెలంగాణ మోడల్ అంటూ ఉదరగొట్టుకుంటూ వచ్చారు. తీరా వచ్చాక తెలంగాణ మోడల్ అంటే అటు చంద్రబాబు, ఇటు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు చేసిన పనులు కలిపి సీఎం కెసిఆర్ చేస్తున్నారు అంటూ మంత్రి కెటిఆర్ గురువారం నాడు క్రెడాయ్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మరి ఇందులో కొత్తగా కెసిఆర్, కెటిఆర్ లు చేసింది ఏమి ఉందన్న ప్రశ్న ఉదయించటం ఖాయం అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మంత్రి కెటిఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆంధ్రా ప్రాంత ఓటర్లకు ఆకట్టుకుందుకు ఇలా మాట్లాడి ఉండవచ్చు కానీ...ఇది తెలంగాణ మొత్తం మీద మాత్రం పార్టీ పై ప్రతికూల ప్రభావం చూపించటం ఖాయం అనే చర్చ సాగుతోంది. తెలంగాణకు బద్ద వ్యతిరేకులుగా చూపించిన ఇద్దరు నేతల మోడల్స్ ను కెసిఆర్ కలిపి అమలు చేస్తున్నారు అని చెప్పటం అంటే ఇది ఒక రకంగా తమ పాలనలో కొత్తదనం ఏమి లేదు అని ఒప్పుకున్నట్లే అని ఒక నేత అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు తామేదో అద్భుతమైన బ్రహ్మ పదార్థం కనిపెట్టాం...దేశంలో ఇది ఎక్కడా లేదు అని చెపుతూ వచ్చిన తెలంగాణ మోడల్ అంటే చంద్రబాబు చేసిన తరహాలో ఐటి, పారిశ్రామిక అభివృద్ధి, వైఎస్ఆర్ లా రైతులు, గ్రామీణ ప్రాంతాలు, పేదల సంక్షేమం రెండు కలిపి సీఎం కెసిఆర్ అమలు చేస్తున్నారు అని చెప్పారు.

మొత్తం మీద మంత్రి కెటిఆర్ మాటలు చూస్తే కొత్తగా తాము చేసున్నది ఏమి లేదు...వీళ్లిద్దరు చేసింది కలిపి తాము రాష్ట్రంలో అమలు చేస్తున్నాం అని చెప్పినట్లు అయింది అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. క్రెడాయ్ సమావేశంలో మంత్రి కెటిఆర్ కామెంట్స్ అయన మాటల్లోనే. ‘ఈ తొమ్మిదేళ్లలో మీరు చూసింది ట్రైలర్ మాత్రమే. సీఎం కెసిఆర్ మదిలో ఇంకా ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు ఉన్నాయి. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. తెలంగాణ ఏర్పాటు అయి తొమ్మిదేళ్లు పూర్తి అయి పడవ ఏడాది లోకి ప్రవేశించాం. మనవి ఇంకా బుడి బుడి అడుగులే. తెలంగాణ గొప్పతనం, తెలంగాణ మోడల్ ఏంటి అంటే ఢిల్లీ లో కానీ..ఇతర చోట్ల ఎక్కడకు పోయినా చెపుతున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ప్రో బిజినెస్, ప్రో ఐటి. హైదరాబాద్ ఐటి, ప్రో బిజినెస్. ఈ టైపు లో అయన ఉన్నారు. అయన ఎజెండా ఇలా ఉండేది. సీఈఓ గా పిలుపించుకోవటానికి ఇష్టపడేవారు. ఐటి ఇమేజ్ లో అయన కు బాగా ఉండేది అది. తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చారు. ఆయనకు ఏమో ప్రో ఫార్మర్, ప్రో పూర్, ప్రో రూరల్ ఇమేజ్ బాగా ఉండేది. తర్వాత చాలా మంది వచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం విషయానైకి వస్తే మీరు రెండు చూస్తారు. చంద్రబాబు ప్రభుత్వం లో ప్రో బిజినెస్ ఉంటే...వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రో ఫార్మర్, ప్రో పూర్ ఉండేది. తెలంగాణ మోడల్ అంటే సమతుల అభివృద్ధి. అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని బ్యాలన్సు చేస్తున్నాం. పల్లెలు ప్రగతి సాదించాలి...పట్టణాలు అభివృద్ధి చెందాలి. ’ ఇదే తమ విధానం అన్నారు కెటిఆర్ . ఏదో ఎన్నికలు వస్తున్నాయని తాను ఏ మాటలు చెప్పటం లేదు అని...తెలంగాణ వాళ్ళు బయటకు వెళ్లి వస్తే ఇక్కడ ప్రగతి బాగా అర్ధం అవుతుంది అని వ్యాఖ్యానించారు .

Next Story
Share it