Telugu Gateway
Telugugateway Exclusives

భూములు అమ్మి స్కీమ్ లు అమలు చేయటానికి కెసిఆర్ ఎందుకు?!

భూములు అమ్మి స్కీమ్ లు అమలు చేయటానికి కెసిఆర్ ఎందుకు?!
X

దేశంలో ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని వాడుకోవటం ఈ ప్రభుత్వాలకు చేతకావటం లేదు. అందుబాటులో ఉన్న వనరులను వాడుకొని దేశాన్ని ప్రగతి పధంలో నడపడంలో కాంగ్రెస్, బీజేపీ లు ఘోరంగా విఫలం అయ్యాయి. ఇది టిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ గత కొంత కాలంగా చెపుతున్న మాట. మరి సీఎం కెసిఆర్ చెపుతున్నది ఏమిటి చేస్తున్నది ఏమిటి అన్న చర్చ తెలంగాణ లోని అధికార వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర పెద్ద. రాష్ట్ర పెద్ద అంటే ఉన్న వనరులను ఎలా పెంచాలి.పెంచిన వనరులను ఎలా సద్వినియోగం చేయాలో చూడాలి. అంతే కానీ ఉన్నవాటిని అన్నిఅమ్మేసి పని కానిస్తే అది సరైన నిర్ణయం ఎలా అవుతుంది. ఇప్పుడు సీఎం కెసిఆర్ పై కూడా అవే విమర్శలు వస్తున్నాయి. కెసిఆర్ సర్కారు గత కొంత కాలంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములు విక్రయిస్తోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతం కోకాపేటలో భూములు అమ్మి 2000 కోట్ల రూపాయలు పైన సమీకరించారు. తర్వాత మళ్ళీ కూడా హెచ్ఎండీఏ ఇప్పుడు పలు ప్రాంతాల్లో భూములు అమ్మి వందల కోట్ల రూపాయలు సమీకరించే పనిలో ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు ...రాష్ట్రము లోని జిల్లాల్లో కూడా భూములు అమ్మి నిధులు సమీకరిస్తున్నారు. భవిష్యత్తు తరాలు, భవిష్యత్తు అవసరాలకు ఉంచాల్సిన భూములను ఎడా పెడా అమ్మేసి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోంది. ప్రభుత్వాలు భూములు అమ్మటం ఇదే మొదటిసారి కాదు కానీ ..ఇలా జిల్లాల్లో కూడా ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అమ్మేస్తూ ముందుకు సాగుతున్న టిఆర్ఎస్ సర్కారు తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఇదే టిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వ భూముల విక్రయాలను తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారం లోకి వచ్చాక మాత్రం తాను వద్దు అన్న పనులే చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలపై అధికారులు విస్మయం వక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు అమ్మి సంక్షేమ కార్యక్రమాల అమలు చేయటానికి సీఎం కెసిఆర్ ఎందుకు...ఏ అధికారికి ఆ పని అప్పగించినా చేస్తారు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. భూములు అయినా ఇతర వనరులు అయినా వాటిని సద్వినియోగం చేసుకునే మార్గాలు వెతకాలి కానీ తెగ నమ్మి పని పూర్తి చేసుకోవటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక వైపు ఇదే కెసిఆర్ దేశంలో ప్రధాని మోడీ అన్ని అమ్మేస్తున్నారు అని విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ లో పలు పధకాల రూపకల్పన రాజకీయ అవసరాలకు అనుగుణంగా చేస్తున్నారు తప్ప...పేదల అవసరాలకు అనుగుణంగా ఉండటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఇలా ప్రజలందరికి చెందాల్సిన ఆస్తులను అమ్మటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ పార్టీలు మాత్రం ప్రభుత్వ ఆస్తులతో తమ రాజకీయ ప్రయోజనాలు తీర్చుకుంటున్నాయి.టిఆర్ఎస్ ఇందులో ముందు వరసలో ఉంది. ఒక వైపు ప్రభుత్వ ఆస్తులు అమ్మటం, మరో వైపు దొరికినంత మేర అప్పులు చేయటం ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న పని. దేశానికీ తెలంగాణ మోడల్ ఆదర్శం అని చెపుతున్న కెసిఆర్ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి మాత్రం పెద్దగా మాట్లాడరు.

Next Story
Share it