Telugu Gateway
Telugugateway Exclusives

ఆరోప‌ణ‌ల‌కూ తెలంగాణ స‌ర్కారు ఆఫ‌ర్లు ఇస్తుందా?

ఆరోప‌ణ‌ల‌కూ తెలంగాణ స‌ర్కారు ఆఫ‌ర్లు ఇస్తుందా?
X

కోకాపేట గోల్ మాల్ పై స‌ర్కారు వింత వివ‌ర‌ణ‌

ఇక‌పై ఆరోప‌ణ‌లు చేస్తే కేసు పెడ‌తారంట‌?

మ‌రి చేసిన వాటిని వ‌దిలేస్తున్న‌ట్లేనా?.

ఎందుకీ ఈ డిస్కౌంట్ ఆఫ‌ర్

తెలంగాణ సర్కారు తీరు విచిత్రంగా ఉంది. ఎవ‌రైనా ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే వెంట‌నే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్ త‌న తొలి ట‌ర్మ్ లోనే త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు కూడా. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నో ఆరోప‌ణ‌లు చేసి ఛాలెంజ్ లు విసిరినా స‌ర్కారు ఒక్కటంటే ఒక్క కేసు పెట్ట‌లేదు. ఇది పాత క‌థ‌. ఇప్పుడు అత్యంత సంచ‌ల‌నం రేపిన కోకాపేట భూముల విష‌యంలోనూ స‌ర్కారు వింత వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చేసింది ఏదో చేశారు..ఇక పై మ‌ళ్ళీ ఆరోప‌ణ‌లు చేస్తే మాత్రం కేసులు పెడ‌తాం అంటూ ప్ర‌క‌టించింది. భూముల వేలం..సాగిన తీరుపై సుదీర్ఘ వివ‌ర‌ణ ఇస్తూ ఇక‌పై ఆరోప‌ణ‌లు చేస్తే న్యాయ‌ప‌ర‌మైన‌చ‌ర్య‌ల‌తోపాటు ప‌రువు న‌ష్టం కేసులు వేస్తామ‌ని తెలిపింది. స‌ర్కారు వివ‌ర‌ణ‌లోని కీల‌క భాగం ఇది. 'కోకాపేట, ఖానామేట్ భూముల వేలం లో పోటీని నిలువరించామని, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ ను తగ్గించామని, బిడ్డింగ్ లో కొన్ని సంస్థలకు మేలు చేశామనే ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి, ఊహాతీతమైనవి గా ప్రకటిస్తున్నాము. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, ఇటువంటి పారదర్శకమైన పద్దతిని తప్పు పట్టడం మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ఠతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించ బోమని వెల్లడిస్తున్నాము. ఇకముందు ఇలాంటి కల్పిత ఆరోపణల పై న్యాయ పరమైన పరువు నష్టం చర్యలు తీసుకోవటం జరుగుతుందని స్పష్టం చేస్తున్నామ‌ని' తెలిపారు.

ఇదిలా ఉంటే కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రిగింద‌ని..స‌ర్కారు అస్మ‌దీయ కంపెనీల‌కే మేలు చేసింద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పోటీని నివారించేందుకు ప‌లు సంస్థ‌ల‌ను బెదిరించార‌ని ఆరోపించారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాన‌ని..పార్ల‌మెంట్ లో కూడా ఈ అంశాన్ని లేవ‌నెత్తుతాన‌ని తెలిపారు. తాను చేసే ఆరోప‌ణ‌ల్లో త‌ప్పు ఉంటే కేసు పెట్టుకోవాల‌ని కూడా స‌వాల్ విసిరారు. ఆరోప‌ణ‌లు చేసిన వ్య‌క్తే కేసుపెట్టుకోమ‌ని స‌వాల్ విసిరితే..దీనికి కూడా సర్కారు ఏదో ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు ఇక ముందు చేస్తే కేసులు పెడ‌తామ‌ని చెప్ప‌టం విచిత్రంగానూ..వింత‌గా ఉంది. అంతేకాదు..అత్యంత సంచ‌ల‌నం రేపిన ఈ వేలం వివాదంపై స‌ర్కారు స్పంద‌న కూడా చాలా ఆల‌శ్యం అయింద‌ని ఓ ఉన్న‌తాధికారి వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింద‌ని..కానీ ఇంత ఆల‌శ్యంగా స్పందించ‌టం..అందులోనూ చాలా మెలికలు పెట్ట‌డంతో ప్ర‌జ‌ల్లో మ‌రిన్ని అనుమానాలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Next Story
Share it