Telugu Gateway
Telugugateway Exclusives

తెలంగాణ సీఎం..సీఎస్ రివర్స్ గేర్

తెలంగాణ  సీఎం..సీఎస్ రివర్స్ గేర్
X

లాక్ డౌన్ తో ఉపయోగం ఉండదన్న కెసీఆర్

సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అంటూ ప్రకటించిన సీఎస్

కరోనాతో తెలంగాన సర్కారు ఆటలు

సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. ఇది కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. లాక్ డౌన్ అవసరం ఉండదని..అయితే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వెల్లడించారు. అక్కడ సీన్ కట్ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ది కూడా ఇదే మాట. ఫాంహౌస్ నుంచి కరోనా నుంచి కోలుకుని వచ్చిన తర్వాత ప్రగతిభవన్ లో నిర్వహించిన సమావేశంలో లాక్ డౌన్ వల్ల అసలు ఉపయోగం ఉండదని ..పలు నివేదికలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయని ప్రకటించారు. అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు అంటోనీ పౌసీతోపటు ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాలు పదే పదే లాక్ డౌన్ పెట్టడం ద్వారానే వైరస్ ను అరికట్టవచ్చని ప్రకటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సైతం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు నిద్రమత్తు వీడాలంటూ ఘాటైన పదజాలంతో లేఖ రాసింది.

వైద్య రంగానికి చెందిన నిపుణులు అందరూ లాక్ డౌన్ పెట్టడం వల్లే ఫలితాలు ఉంటాయని చెబుతుంటే సీఎం కెసీఆర్ అందుకు రివర్స్ గా వ్యాఖ్యలు చేయటం విశేషం. మరి లాక్ డౌన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్న కెసీఆర్ నివేదికలు ఏమైపోయాయి. మే 7నే సీఎం కెసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ సడన్ గా సోమవారం నాడు మంత్రివర్గం సమావేశంపై నిర్ణయం తీసుకుని..వెంటనే లాక్ డౌన్ కు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన మరో కీలక అంశం ఏమిటంటే తెలంగాణా కరోనా కేసుల గురించి. కొద్ది రోజుల క్రితం ఓసారి పది వేల వరకూ కరోనా కేసులు చూపించారు హెల్త్ బులెటిన్ లో. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.

మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు పెరుగుతుంటే వాటిని నియంత్రించటానికి లాక్ డౌన్ పెట్టారు. లాక్ డౌన్ వల్ల ప్రయోజనం కళ్ల ముందు కనపడుతోందని ఢిల్లీ లెక్కలు చెబుతున్నాయి. కానీ తెలంగాణాలో మాత్రం విచిత్రంగా వరసగా కేసులు తగ్గుతున్నట్లు హెల్త్ బులెటిన్ చెబుతోంది. ముఖ్యమంత్రి కెసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ వ్యాఖ్యలు..తెలంగాణ హెల్త్ బులెటిన్ కు భిన్నంగా సర్కారు నిర్ణయాలు ఉన్నాయి. మొత్తానికి ఇది అంతా చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతోందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. కరోనాతో సర్కారు ఆడుకుంటుందనే విషయం ఈ నిర్ణయాలతో తేటతెల్లం అయిందని ఆయన వ్యాఖ్యానించారు .

Next Story
Share it