Telugu Gateway
Telugugateway Exclusives

అప్పుడు కూడా అసెంబ్లీకి అంత భ‌ద్ర‌త లేదు!

అప్పుడు కూడా  అసెంబ్లీకి అంత భ‌ద్ర‌త లేదు!
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ భాషలో చెప్పాలంటే 'స్వ‌రాష్ట్రం. స్వ‌ప‌రిపాల‌న‌. సుప‌రిపాల‌న‌'. రాష్ట్రం వ‌చ్చి ఏడేళ్లు దాటింది. తెలంగాణ దేశానికే ఆద‌ర్శం అంటారు. దేశంలోనే ఎక్క‌డా లేని ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామంటారు. కానీ అసెంబ్లీ సమావేశాల సంద‌ర్భంగా స‌ర్కారు చేసిన ఏర్పాట్లు చూసి ప్ర‌జ‌లు కూడా అవాక్కు అయ్యే ప‌రిస్థితి. అసెంబ్లీ ముందు ఆ రోడ్డుకు ఈ రోడ్డుకు మ‌ధ్య కూడా పెద్ద ఎత్తున ఇనుప జాలీలు పెట్టారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఇవి క‌ట్టారు. అస‌లు అసెంబ్లీ ముందు నుంచి బ‌షీర్ బాగ్ వెళ్ళే మార్గంలో ఇటువైపు నుంచి అసెంబ్లీ వైపు పోవాలంటే మ‌ధ్య‌లో ఉండే ట్రాఫిక్ తో అస‌లు ఓ ప‌ట్టాన సాధ్యంకాదు. అలాంటిది ఎవ‌రు వ‌స్తారు అని మ‌ధ్య‌లో ఇంత భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారో అర్ధం కావ‌టంలేద‌ని కొంత మంది ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్డుకు మ‌ధ్యలో ఇనుప జాలీలు క‌ట్ట‌డంతో పాటు అసెంబ్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో కూడా క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో ఇనుప కంచెల భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు ఈ సారి.

రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు తెలంగాణ ఉద్య‌మం పీక్ లో న‌డిచిన స‌మ‌యంలో కూడా ఎప్పుడూ ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేయ‌లేదు. రోడ్డు మ‌ధ్య‌లో ఇనుప జాలీలు క‌ట్ట‌లేదు. ముఖ్య‌మంత్రి కెసీఆర్ అధికారిక నివాసం ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ద్ద భ‌ద్ర‌తా ఏర్పాట్లు చూసిన వారెవ‌రైనా కూడా అవాక్కు అవ్వాల్సిందే. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెన‌క భాగంలో కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్యయంతో భారీ గోడ నిర్మించారు. ముందు భాగంలో కూడా భ‌ధ్ర‌తా ఏర్పాట్లు మామూలుగా ఉండ‌వు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కూడా ఏ సీఎంకూ లేనంత భ‌ద్ర‌తా ఏర్పాట్లు ప్ర‌స్తుతం సీఎం కెసీఆర్ చేసుకున్నారు. గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ , బిజెపిలు రాజ‌కీయంగా దూకుడు పెంచ‌టంతో ఈ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఏమైనా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిస్తాయో అన్న భ‌యంతోనే అసెంబ్లీ ద‌గ్గ‌ర ప్ర‌భుత్వం ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. శుక్ర‌వారం నాడు ప్రారంభం అయిన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు అక్టోబర్ 5 వ‌ర‌కూ కొన‌సాగ‌నున్నాయి.

Next Story
Share it