టీడీపీతో పొత్తుకు పవన్ కళ్యాణ్ సంకేతాలు?!
ప్రచారమే నిజం కాబోతుందా?. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మళ్ళీ కలబోతున్నాయా?. మరి బిజెపి పరిస్థితి ఏంటి?. బిజెపి కూడా ఈ జట్టులో ఉంటుందా?. సార్వత్రిక ఎన్నికల్లో పోరు వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బిజెపి అయ్యే సూచనలే కన్పిస్తున్నాయి. బుధవారం నాడు జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 'రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే నేను ఎవరితోనైనా కలుస్తాను. అవసరమైతే వ్యూహం మారుస్తాను. భారతీయ జనతా పార్టీతో కలిసినప్పుడు ఇదే అడిగాను. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటును తొలగించాలి. రాయలసీమ నుంచి వలసలను నిరోధించాలని కోరాను. వాళ్లు దానికి అంగీకరించడంతో వాళ్లతో కలిశాను.' అని వ్యాఖ్యానించారు. పవన్ ఇప్పటికే బిజెపితో కలిసే ఉన్నారు. ఇక ఏపీలో ఆయన కలవటానికి టీడీపీ తప్ప మరో పార్టీ ఏదీ లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండబోతుందనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల టీడీపీ, జనసేనలు కలసి పనిచేశాయి. కొన్నిచోట్ల బహిరంగంగానే ఈ పనిచేయగా..మరికొన్ని చోట్ల అంతర్గతంగా ఒప్పందాలు చేసుకుని రాజకీయం నడిపించారు. ఈ రోజుకు ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే వైసీపీని టీడీపీ అయినా, ఇటు జనసేన అయినా ఒంటరిగా ఢీకొట్టడం అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే మాత్రం రాజకీయం రసవత్తరంగా మారుతుంది. అయితే గతంలో చంద్రబాబు, నారా లోకేష్ లపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో చేసిన విమర్శల వ్యవహారం ఒకింత ఇబ్బందిగా మారటం ఖాయం. వచ్చే ఎన్నికలు వైసీపీ అధినేత, సీఎం జగన్ కు కూడా అంత నల్లేరు మీద నడకేం కాదు.
ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదాతోపాటు కడప స్టీల్ ప్లాంట్, భారీ ఓడరేవు వంటి విభజన హామీల విషయంలో హ్యాండ్సప్ అన్నారు. అంతే కాదు..వైసీపీ సర్కారు మద్యం విధానంతోపాటు ఇసుక, రోడ్ల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికి తోడు సీఎం జగన్ ఇప్పటివరకూ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వకపోవటం వంటి అంశాలు రాజకీయంగా వైసీపీకి మైనస్ గా మారాయని ఆ పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వటంలేదు..ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కీలక నాయకులు..క్యాడర్ అడిగే పనుల విషయంలో చేతులెత్తేస్తున్నారు. ఇవన్నీ కూడా వైసీపీకి ప్రతికూలాంశాలుగా మారబోతున్నాయి. కారణాలు ఏమైనా ఏపీ రాజధాని అమరావతిని అటకెక్కించి..మూడు రాజధానుల నినాదం అందుకున్నారు. అది కూడా అడుగు ముందుకు పడలేదు. ఐదేళ్ళలో చంద్రబాబు ఒక్క ఇటుక వేయలేదు అంటూ విమర్శలు చేసిన వైసీపీ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ తమకు లాభిస్తాయని టీడీపీ, జనసేన వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి.