Telugu Gateway
Telugugateway Exclusives

టి టీడీపీ పునరుద్ధరణ రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ !

టి టీడీపీ పునరుద్ధరణ రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ !
X

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ కాంగ్రెస్ ను ఒక సారి పొత్తు పెట్టుకుని దెబ్బ కొట్టారు. ఇప్పుడు తెలంగాణ లో టి టీడీపీ ని పునరుద్ధరించి దెబ్బ కొట్టబోతున్నారా. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. అసలు టీడీపీకి, కాంగ్రెస్ కి సంబంధం ఏమిటి అంటారా ..ఈ రెండు పార్టీల పొత్తును గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్న విషయం తెలిసిందే.ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ కి రావాల్సిన అన్ని సీట్లు కూడా రాలేదనే అంచనాలు ఉన్నాయి. ఈ మాటను కాంగ్రెస్ నేతలు చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతుండటంతో తెలంగాణ లో ఇక లోకల్ సెంటిమెంట్స్ కు కాలం చెల్లినట్లుగా అందరూ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు కూడా తెలంగాణ టీడీపీ బాధ్యతలను బక్కని నర్సింహులు నుంచి తప్పించి ఆర్థికంగా బలంగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీని ద్వారా అయన రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను పెంచనున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇది కచ్చితంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి నష్టం చేయటం ఖాయం అనే అభిప్రాయం ఉంది రాజకీయ నేతల్లో. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా చాలా మంది టీడీపీ సానుభూతిపరులు రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు.

ఇప్పుడు తెలంగాణ లో చంద్రబాబు పార్టీ ని ఆక్టివ్ చేస్తే వాళ్ళు సహజంగా అటు వైపు వెళతారు అనే విషయం తెలిసిందే. ఇంత కాలం రాష్ట్రంలో పార్టీ చురుగ్గా లేకపోవటంతో చాలా మంది రేవంత్ వైపు చూశారు. కానీ తాజా పరిణామాలు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి కి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఎన్నికల నాటికీ ఎవరు ఎవరితో కలుస్తారు అన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పడు అటు ఆంధ్ర ప్రదేశ్ లో అయినా..ఇటు తెలంగాణ లో అయినా తొలుత బీజేపీ తో కలవటానికి ప్రాధాన్యత ఇస్తారు అన్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. మునుగోడు లో పరాజయం తర్వాత అయినా బీజేపీ, తెలంగాణ లో టీడీపీ తో పొత్తుకు సిద్ధం అవుతుందా లేక ముందు నుంచి చెపుతున్నట్లు ఒంటరి పోరుకే కట్టుబడుతుందా అన్నది చూడాలి. కానీ చంద్రబాబు నిర్ణయం కాంగ్రెస్ కు రాజకీయంగా మరో సారి నష్టం చేయటం ఖాయం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ప్రస్తుతం టీపీడీ తెలంగాణ లో సొంతంగా ఎన్ని సీట్లు గెలవగలదనే విషయం చెప్పటం కష్టం కానీ..ఆ పార్టీ ఓట్లు ఇతర పార్టీల గెలుపుకు మాత్రం కీలకం అవుతాయనే విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే దేశానికే ఆదర్శ పాలనా ఇచ్చామని చెప్పుకుంటున్న టిఆర్ఎస్ గతంలో తోక పార్టీలు అంటూ విమర్శించిన సిపిఐ, సీపీఎంలతో కెసిఆర్ పొత్తు పెట్టుకొని మునుగోడు నుంచి బయటపడిన విషయం తెలిసిందే. అందుకే కొంత మంది నేతలు అధికార టిఆర్ఎస్ తోకలు పట్టుకొని బయటపడింది అని కామెంట్ చేస్తున్నారు.

Next Story
Share it