గ్రేటర్ వార్ లో సోషల్ మీడియాదే కీలక పాత్ర
అత్యంత ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోసోషల్ మీడియా దుమ్మురేపుతోంది. పార్టీ ఏదైనా కావొచ్చు...నాయకుడు ఎవరైనా కావొచ్చు దొరికితే ఉతికేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా అంతా ఇదే నడుస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ తోపాటు వాట్సప్ ల్లోనూ రోజుకు పదుల సంఖ్యలో వీడియోలు, వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నోరు జారితే చాలు..ఎవరైనా సరే బుక్ అయినట్లే. ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్, బిజెపి,కాంగ్రెస్ లు పెద్ద ఎత్తున సోషల్ మీడియా టీమ్ లను ఏర్పాటు చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నాయి. విశేషం ఏమిటంటే గెలిస్తే తామేమి చేస్తామో చెప్పటం కంటే ప్రత్యర్ధులకు సంబంధించిన ప్రతికూల అంశాలు..గతంలోచెప్పిన మాటలు ఏంటి?. ఇప్పుడు చేస్తున్నది ఏమిటి వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ మీకు ఎలాంటి హైదరాబాద్ కావాలి. ప్రతి రోజూ లొల్లి జరిగి..ఘర్షణలు జరిగే హైదరాబాద్ కావాలా? లేక ప్రశాంతమైన నగరం కావాలా తేల్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు. ఇదే అదనుగా బిజెపి ఓ వీడియోను సిద్ధం చేసింది. అదేంటి అంటే నగరంలోని కార్పొరేటర్లు గతంలో పలు చోట్ల బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడిన వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్ లను కెసీఆర్ మాటలకు జోడించి వైరల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. ఈ క్లిప్పింగ్ ఎడిట్ చేసిన విధానం కూడా పర్పెక్ట్ గా ఉంది.
అదే సమయంలో బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ చలాన్ల రద్దు, ట్రిబుల్ రైడింగ్ కు అనుమతిస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ టీమ్ లు ఎక్కువగా వైరల్ చేస్తున్నాయి. నిజానికి ఇది ఓ విచిత్ర ప్రతిపాదన. అమోదయోగ్యమైనది కూడా కాదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ చెప్పిన హామీలు..అమలు చేయిని అంశాలు కూడా ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీలు ఓ అస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఎన్నికలు జరిగేది అంతా పట్టణ ప్రాంతం కావటంతో పార్టీలు సోషల్ మీడియాపై పెద్ద ఎత్తున వ్యయంచేస్తున్నా యి. అభ్యర్ధులు కూడా ఎవరికి వారు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి తమ పాజిటివ్అంశాలను ప్రచారం చేసుకోవటానికి సోషల్ టీమ్ లను వాడుకుంటున్నారు. ఈ వారం రోజులు సోషల్ మీడియా పార్టీల ప్రచారం హోరెత్తటం ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతానికి అయితే బిజెపి అధికార టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది. టీఆర్ఎస్ మాత్రం అకస్మాత్తుగా ఇప్పుడే కేంద్రం నుంచి నుంచి లక్ష కోట్లు తీసుకురండి అన్న నినాదం ఎత్తుకుంది. మరి ఆఫ్ లైన్, ఆన్ లైన్ పోరాటంలో విజేతగా ఎవరు విజేతగా నిలుస్తారో వేచిచూడాల్సిందే.