Telugu Gateway
Telugugateway Exclusives

కేసు ఒక‌టే..కెటీఆర్ కోణాలు మాత్రం రెండా?!

కేసు ఒక‌టే..కెటీఆర్ కోణాలు మాత్రం రెండా?!
X

తెలంగాణ ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటీఆర్ మంగ‌ళ‌వారం నాడు ఓ ట్వీట్ చేశారు. ఓటుకు నోటు...స్కాంగ్రెస్, బిజెపిలో సీఎం సీటు 2500 కోట్ల రూపాయ‌ల రేటు అంటూ అందులో వ్యాఖ్యానించారు. టీ కాంగ్రెస్ చీప్ ఒక ఓటుకు నోటు దొంగ‌, కాంగ్రెస్, బిజెపి దొందూ దొంటే అంటూ ట్వీట్ ను ముగించి..వీటికి సంబంధించి ప‌త్రిక‌ల క్లిప్పింగ్ ల‌ను కూడా జ‌త చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిన విష‌యం దేశ‌మంతా చూసిన సంగ‌తే. క‌ర్ణాట‌క‌లో 2500 కోట్ల రూపాయ‌లు ఇస్తే సీఎం ప‌ద‌వి అంటూ బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యానించిన వార్త క్లిప్పింగ్ ను కూడా ఈ ట్వీట్ కు జ‌త చేశారు. కానీ కెటీఆర్ ఓ విష‌యం మ‌ర్చిపోయారు. ఒకే కేసుకు సంబంధించి ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను టీఆర్ఎస్ పార్టీ, కెటీఆర్ రెండు కోణాల్లో చూస్తారా?. రేవంత్ రెడ్డిపై ఆయ‌న రాజకీయ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఓకే. వాటికి రేవంత్ కూడా అంతే కౌంట‌ర్ ఇస్తుంటారు. ఓటుకు నోటు కేసు ను టీఆర్ఎస్ నేత‌లు ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తుంటారు. ఇదే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ జైలుకు వెళ్లొచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌ను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అంతే కాదు..ఆయ‌న‌కు పార్టీలో ఎక్క‌డలేని ప్రాధాన్య‌త కూడా ల‌భిస్తుంది సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ ల ద‌గ్గ‌ర‌. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ త‌ర‌పున పోటీ చేసి గెలుపొంది...ఆ త‌ర్వాత టీఆర్ఎస్ లో చేరారు.

ఓటుకు నోటు కేసు పెట్టింది ఇదే ప్ర‌భుత్వం . కానీ రేవంత్ రెడ్డి విష‌యంలో ఒక‌లా...సండ్ర వెంక‌ట‌వీర‌య్య విష‌యంలో మ‌రోలా కెటీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌కు ప్ర‌త్య‌క్షంగా సంబంధం ఉందా..ప‌రోక్షంగా సంబంధం ఉన్న‌దా అన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే ఈ కేసు న‌మోదు చేసింది టీఆర్ఎస్ స‌ర్కారే. ఆయ‌న కూడా ఈ కేసులో రేవంత్ రెడ్డి త‌ర‌హాలోనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు నుంచి త‌న‌ను త‌ప్పించాలంటూ సండ్ర వెంక‌ట‌వీర‌య్య వేసిన క్వాష్ పిటీష‌న్ ను కూడా కోర్టులు తిర‌స్క‌రించాయి. అంతే కాదు..సండ్ర వెంక‌ట‌వీర‌య్య ఈ కుట్ర‌లో భాగ‌స్వామేన‌ని తెలంగాణ ఏసీబీనే చెబుతోంది. ఒకే కేసులో ఒక నిందితుడిని సొంత పార్టీలో చేర్చుకుని...మ‌రోకరిపై మాత్రం నిత్యం విమ‌ర్శ‌లు చేస్తుంటే ప్ర‌జ‌లు ఈ విష‌యాల‌ను ప‌ట్టించుకోరా?. పోనీ నిజంగా టీఆర్ఎస్ కు ప‌క్క పార్టీలో గెలిచిన వారిని చేర్చుకోవాల్సిన అంత అవ‌స‌రం ఉందా అంటే అది కూడా లేదు. అయినా స‌రే తాము విమ‌ర్శ‌లు చేసే తీవ్ర‌మైన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్య‌క్తిని మాత్రం అవ‌స‌రం లేకపోయినా రాజ‌కీయ కార‌ణాల‌తో చేర్చుకున్నారు.

Next Story
Share it