Telugu Gateway
Telugugateway Exclusives

బిజెపితో షర్మిల పార్టీ పొత్తు?!

బిజెపితో షర్మిల పార్టీ పొత్తు?!
X

మేలో పార్టీ ప్రకటన...కార్యాలయం కోసం స్థల సేకరణ కూడా పూర్తి!

అకస్మికంగా అసలు తెలంగాణలో షర్మిళ పార్టీ తెరపైకి ఎందుకొచ్చింది?. రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పుడు తెలంగాణలో ఎంతో బలంగా ఉన్నప్పుడు టీడీపీ ఇప్పుడు ఉనికి కోల్పోయిన పరిస్థితి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత షర్మిళ అసలు ఇక్కడి రాజకీయాల్లో కానీ..ఆ మాటకు వస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. మరి షర్మిళ సడెన్ ఎంట్రీ వెనక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. షర్మిళ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకోనుందని..త్వరలోనే దీనికి సంబంధించి ఢిల్లీలో సమావేశాలు కూడా జరగనున్నాయని విశ్వసనీయ సమాచారం. ఈ సారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మరింత జోష్ ను ఇచ్చాయి.

అయితే కొంత మంది మాత్రం షర్మిళ పార్టీ వెనక ఏపీ జగన్, తెలంగాణ సీఎం కెసీఆర్ ఉన్నారని ఓ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అటు జగన్ కానీ..ఇటు కెసీఆర్ కానీ బిజెపిని వ్యతిరేకించే పరిస్థితులు లేవు. చివరకు తెలంగాణ సీఎం కెసీఆర్ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అసలు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఇప్పటివరకూ కనీసం నోరుతెరిచి మాట్లాడిన పాపాన పోలేదు. అంతే కాదు..కేంద్ర, రాష్ట్ర సంబంధాలు అంటూ ఓ వింత వ్యాఖ్యలు చేశారు ప్లీనరీ సమావేశంలో. ఇక జగన్ విషయానికి వస్తే ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే..ఘాటుగా స్పందించాల్సిన జగన్ ఏదో ఓ లేఖ రాసి సరిపెట్టారు. వాస్తవానికి కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ విషయాల్లో తీరని అన్యాయం చేసింది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా జగన్ స్పందించాల్సిన రీతిలో స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అలాంటి బిజెపికి వ్యతిరేకంగా అటు కెసీఆర్, ఇటు జగన్ ప్రస్తుతానికి అయితే కత్తి తిప్పే పరిస్థితులు లేవు. అందుకే తెరవెనక ప్రయత్నాలు చేసి బిజెపి నేతలు జగన్ ద్వారానే షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నరని ఢిల్లీకి చెందిన ఓ కీలక నేత తెలిపారు. జగన్ అనుమతి లేకుండా ఆమె లోటస్ పాండ్ లో సమావేశం పెట్టగలదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో దివంగత రాజశేఖర్ రెడ్డికి భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాజిక కోణం కూడా కలసి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు షర్మిల వ్యవహరశైలి కూడా నేతలతో సానుకూలంగానే ఉంటుందని ఆమెను దగ్గర నుంచి చూసిన నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న వారంతా తెలంగాణలో షర్మిళ పార్టీ వైపు మళ్లితే అది అటు బిజెపికి, ఇటు షర్మిళ పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందనేది అసలు వ్యూహం. రెండు పార్టీలు కలసి తెలంగాణలో అధికారంలోకి వచ్చినా అది జగన్ కు కూడా సానుకూల అంశమే అవుతుంది.హైదరాబాద్ షర్మిల మంగళవారం నాడు ప్రారంభించిన అత్మీయ సమ్మేళనాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it