సజ్జల సైడ్...విజయసాయిరెడ్డి స్పీడ్!
వైసీపీలో ఎప్పుడు ఎవరి జాతకాలు మారతాయో...ఎవరి జాతకాలు తిరగబడతాయో చెప్పలేం. నిన్న మొన్నటి వరకూ వైసీపీలో సీఎం జగన్ తర్వాత అంతా తానై వ్యవహరించారు ప్రభుత్వ సలహాదారు సజ్లల రామక్రిష్ణారెడ్డి. కానీ తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీలో మాత్రం ఆయనకు వేదికపై మాట్లాడే ఛాన్స్ రాలేదు. ఇది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి కూడా సజ్జల సీనియర్ మంత్రులను సైతం పక్కన పెట్టుకుని తానే మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో జరిగిన ప్లీనరీల్లో సజ్జల కు మాట్లాడే చాన్స్ దక్కింది. కానీ ఈ సారి మాత్రం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయనకు ప్లీనరీ వేదిక నుంచి మాట్లాడే అవకాశం రాకపోవటం పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ ప్లీనరీ సమయంలో ఎంతసేపూ వేదిక కింద మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు తప్ప...వేదికపైన మాత్రం మాట్లాడకపోవటం వెనక కారణాలపై చర్చ సాగుతోంది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా సజ్జలను సకల శాఖ మంత్రి అంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
సజ్జల తీరు పార్టీలో చాలా మంది నేతలకు ఏ మాత్రం రుచించకపోయినా సరే పార్టీ అధినేత, సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతతో వాళ్లు కూడా మౌనంగా ఉండిపోయారు. ప్లీనరీ సందర్భంగా ప్రధానంగా మంత్రులు..ఎమ్మెల్యేల వంటి వారికే ఛాన్స్ ఇవ్వాల్సిందిగా పీకె టీమ్ సూచించింది అని వైసీపీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. అందుకే సజ్జల రామక్రిష్ణారెడ్డితో పాటు మరో సీనియర్ నేత, అత్యంత కీలకమైన వైజాగ్ ఇన్ ఛార్జిగా ఉన్న వై వీ సుబ్బారెడ్డికి కూడా మాట్లాడే ఛాన్స్ రాలేదంటున్నారు. అయితే ఈ సారి ప్లీనరీలో షో అంతా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డే నడిపించారని..ఆయన స్పీడ్ తో సజ్జల వెనక్కుపోయారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండవ సారి రాజ్యసభ రెన్యువల్ వరకూ విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన సజ్జలను వెనక్కి నెట్టి ముందుకొచ్చారని వైసీపీలో చర్చ సాగుతోంది. మరి ఇదే ట్రెండ్ రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందా లేక ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది వేచిచూడాల్సిందే.