Telugu Gateway
Telugugateway Exclusives

రాజ్య‌స‌భ రేసులో సజ్జల రామకృష్ణ రెడ్డి?!

రాజ్య‌స‌భ రేసులో సజ్జల రామకృష్ణ రెడ్డి?!
X

అదికార వైసీపీలో కీల‌క ప‌రిణామం. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉంటూ ఏపీ ప్ర‌భుత్వంలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న సజ్జల రామకృష్ణ రెడ్డికి త్వ‌ర‌లోనే ప‌దోన్న‌తి వ‌చ్చే అవ‌కాశం ఉందా?. అంటే ఔన‌నే అంటున్నాయి ఆ పార్టీ వ‌ర్గాలు. ఈ ఏడాది జూన్ లో ఖాళీ కానున్న రాజ్య‌స‌భ స్థానాల్లో వైసీపీకి నాలుగు సీట్లు ద‌క్కుతాయి. అందులో ఒక‌టి సజ్జల రామకృష్ణ రెడ్డికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. ఇప్పుడు ఈ అంశం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప టి నుంచి ఆయ‌న ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా ఆయ‌న్ను టార్గెట్ చేశాయి. మంత్రుల‌ను డ‌మ్మీల‌ను చేసి షో అంతా ఆయనే న‌డిపిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఒక‌ప్పుడు పార్టీలో నెంబ‌ర్ టూగా ఉన్న వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి హ‌వా గ‌త కొంత కాలంగా త‌గ్గుతూ వ‌స్తోంది. అదే స‌మ‌యంలో సజ్జల రామకృష్ణ రెడ్డి ఆ స్థానాన్ని ఆక్ర‌మించార‌ని పార్టీ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు రాజ్య‌స‌భ ద్వారా సజ్జల రామకృష్ణ రెడ్డిని ఢిల్లీకి పంపితే అక్క‌డ కూడా విజ‌య‌సాయిరెడ్డి హ‌వాకు బ్రేక్ వేయాల‌నే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీంతోపాటు రాజ్య‌స‌భ సీటు ద‌క్కించుకోగిలిగితే రాజ‌కీయంగా త‌న‌కు మ‌రింత గుర్తింపు వ‌చ్చిన‌ట్లు అవుతుంద‌నే భావ‌నలో స‌జ్జ‌ల ఉన్నార‌ని చెబుతున్నారు. మ‌రో కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే విజ‌యసాయిరెడ్డికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం రెన్యువ‌ల్ ఉంటుందా? ఉండ‌దా అన్న దానిపై పార్టీలో ర‌క‌ర‌కాలు చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్ లో ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విజ‌య‌సాయిరెడ్డితోపాటు టీ జీ వెంక‌టేష్‌, సుజ‌నా చౌద‌రి, సురేష్ ప్ర‌భులు రిటైర్ కానున్నారు. ఇదిలా ఉంటే వాయిదా ప‌డిన మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ను కూడా ఉగాది నాటికి పూర్తి చేసి...ఆ స‌మ‌యంలోనే పార్టీ ఇన్ ఛార్జిల వ్య‌వ‌స్థ‌లో మార్పులు చేసి రాజ్య‌స‌భ ఖాళీల భ‌ర్తీ నాటికి పార్టీ ప‌రంగా ప‌లు అంశాల‌పై స్పష్ట‌త తీసుకురావాల‌నే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

Next Story
Share it