Telugu Gateway
Telugugateway Exclusives

స‌జ్జ‌ల అడిగారు...చంద్ర‌బాబు ఓకే అన్నారు

స‌జ్జ‌ల అడిగారు...చంద్ర‌బాబు ఓకే అన్నారు
X

ప‌ద్ద‌తిగా ఫోన్ చేసి అడ‌గ‌క‌పోయినా సంప్ర‌దాయ‌మంటూ వ్యాఖ్య‌లు

టీడీపీ నేత‌ల్లో తీవ్ర అసంతృప్తి

జ‌న‌సేన‌ను ఫాలోఅయిన‌ట్లు ఉంద‌ని వ్యాఖ్య‌లు

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి టీడీపీకి చుక్క‌లు చూపిస్తోంది. అందివ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌టం లేదు. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు, నారా లోకేష్ ద‌గ్గ‌ర నుంచి ఆ పార్టీ నేత‌లు అంద‌రూ బ‌హిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.. వేధిస్తున్నారు..వేధిస్తున్నారు అని. ఎంత మొత్తుకున్నా అధికార వైసీపీ తాను అనుకున్న ప‌నులు అన్నీ చేసుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలో టీడీపీ కి చెందిన ప‌లువురు నేత‌లు జైళ్ళ‌కు కూడా వెళ్ళొచ్చారు. బ‌య‌టికి మాత్రం లెక్క‌లు రాస్తున్నాం..బుక్స్ ప్రింట్ చేస్తున్నాం అంటూ క‌బుర్లు చెప్ప‌టం త‌ప్ప‌..అస‌లు జ‌రుగుతున్న క‌థ వేరుగా ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర జ‌రిగిన బ‌ద్వేలు ఉప ఎన్నిక‌కు సంబంధించిన స‌మావేశం అనంత‌రం ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా మాట్లాడుతూ చ‌నిపోయిన వ్య‌క్తుల కుటంబ‌ స‌భ్యులే బ‌రిలో ఉంటే పోటీ పెట్ట‌కుండా ఉండే సంప్ర‌దాయం గ‌తంలో ఉండేద‌ని..టీడీపీ దీన్ని పాటిస్తే ఓకే..లేక‌పోతే పోటీచేసినా తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ఇలా మీడియా ముందు మాట్లాడారు త‌ప్ప‌..ఓ ప్ర‌ధాన పార్టీగా టీడీపీని గుర్తించి..ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడితో కూడా వైసీపీ నేత‌లు ఎవ‌రూ కూడా సంప్ర‌దాయం ప్ర‌కారం పోటీ చేయ‌కుండా ఉంటే బాగుంటుంది..ఓ సారి ఆలోచించండి అనే ప్ర‌తిపాద‌న అధికార వైసీపీ నుంచి రాలేద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. కానీ చంద్ర‌బాబు త‌నంత తానే అస‌లైన సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక‌గా నిలిచే వ్య‌క్తిగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఓ సీనియ‌ర్ నేత వెట‌కారంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణ‌యాల‌తో పార్టీ నాయ‌కులు, క్యాడ‌ర్ కు ఎలాంటి సంకేతాలు వెళ‌తాయ‌నే అంశాన్ని ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అటు చంద్ర‌బాబునాయుడు, ఇటు నారా లోకేష్ లు ఇద్ద‌రూ కూడా ఉప‌ ఎన్నిక‌పై డ‌బ్బు ఖ‌ర్చుపెట్ట‌డానికి ఏ మాత్రం ఆస‌క్తిచూప‌కే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. టీడీపీ బ‌రిలో నిలిచే ఉంటే..సీఎం సొంత జిల్లా..ఉప ఎన్నిక‌..ఇంకా ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండేళ్ళ స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అధికార వైసీపీ భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టాల్సి వ‌చ్చేద‌ని..అలాంటి స‌మ‌యంలో సొంత పార్టీ లీడ‌ర్లు, క్యాడ‌ర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌టంతోపాటు ప్ర‌త్య‌ర్ధి పార్టీకి కోట్ల రూపాయ‌లు ఆదా చేసిపెట్టేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని మ‌రో నేత వ్యాఖ్యానించారు.

అది కూడా జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత చంద్ర‌బాబు అదే త‌ర‌హా ప్ర‌క‌ట‌న చేయ‌టం రాజ‌కీయంగా ఆ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలియ‌చెబుతోంద‌ని అంటున్నారు. అయితే అస‌లు బిజెపి బ‌లం ఏంటో సొంతంగా పోటీ చేస్తే ఆ పార్టీకి తెలిసి వ‌స్తుంద‌ని..అందుకే టీడీపీ, జ‌న‌సేన క‌ల‌సి ఈ నిర్ణ‌యం తీసుకున్నాయ‌ని టీడీపీ వ‌ర్గాలు ప్ర‌చారంలో పెట్టాయి. కార‌ణాలు ఏమైనా బ‌ద్వేలు ఉప ఎన్నిక విష‌యంలో చంద్ర‌బాబు నిర్ణ‌యం మాత్రం పార్టీ నేత‌ల‌కు ఏ మాత్రం రుచించ‌టం లేదు. ఇలా చేసే తెలంగాణ‌లో ఎంతో ప‌టిష్టంగా ఉన్న పార్టీని దారుణంగా దెబ్బ‌తీశార‌ని..ఇప్పుడు ఏపీలోనూ అదే బాట‌లో న‌డిపిస్తున్న‌ట్లు ఉంద‌ని ఓ నేత ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నోటిఫికేష‌న్ వ‌చ్చిన రోజే తెలుగుదేశం అభ్య‌ర్ధి రాజ‌శేఖ‌ర్ బ‌రిలో ఉంటార‌ని పార్టీ నేత‌లు వెల్ల‌డించిన‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి సెప్టెంబ‌ర్ 30నే సీఎం జ‌గ‌న్ బ‌ద్వేలు ఉప ఎన్నిక‌పై స‌మావేశం పెట్టి త‌మ అభ్య‌ర్ధి ఎవ‌రో ప్ర‌క‌టించారు. వైసీపీ అభ్య‌ర్ధి ఎవ‌రో ప్ర‌క‌ట‌న‌ వెలువ‌డిన మూడు రోజుల త‌ర్వాత అక‌స్మాత్తుగా పొలిట్ బ్యూరో స‌మావేశం పెట్టి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.మ‌రో కీల‌క విష‌యం ఏమిటంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ హ్యాండ్స‌ప్ అన్న త‌రుణంలోనూ బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలో గోప‌వ‌రం జ‌డ్పీటీసీని ఆ పార్టీ నేత‌లు కైవ‌లం చేసుకోవ‌టం.

Next Story
Share it