జగన్ కు 'లెక్కలు తెలియదంటే'ఎవరైనా నమ్ముతారా?!
'చంద్రబాబులాగా రైతు రుణమాఫీ నేను కూడా చేస్తా అని ఒక్క అబద్ధం చెపితే 2014లో నేనే గెలిచేవాడిని. కానీ అందుకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించదని తెలిసే..అబద్ధాలు చెప్పటం ఇష్టంలేకే చెప్పలేదు.' ఇవీ గతంలో జగన్ పలుమార్లు చేసిన వ్యాఖ్యలు. తాను అన్నీ చూసుకున్న తర్వాతే..అమలు చేయగలనని నిర్ణయించుకున్నాకే హామీలు ఇస్తానని ప్రకటించుకున్నారు. ఆర్ధిక లెక్కలైనా..రాజకీయ లెక్కలైనా జగన్ కు బాగానే తెలుసు. ఆర్ధిక లెక్కల విషయం గతంలోనే వెల్లడైనా..రాజకీయ లెక్కల విషయంలో అదికారంలోకి వచ్చాక...జగన్ నిర్ణయాలు చూశాక అందరికీ అవగతమవుతుంది.కానీ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు అకస్మాత్తుగా కంట్రిట్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై తమకు అప్పుడు సాంకేతిక అంశాలు ఏమీ తెలియదని..ఇది అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని వ్యాఖ్యానించి కలకలం రేపారు. కొద్దిరోజుల క్రితం ఇదే సజ్జల సీపీఎస్ పై కమిటీ చర్చలు చేస్తుందని..త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ప్రకటించారు. కానీ సడన్ గా మంగళవారం నాడు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అంటూ ప్రకటించి ఈ హామీ విషయంలో ఎలా చేయబోతున్నారో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రతి దానికి ఎన్నో లెక్కలు చూసుకునే జగన్ ఏ మాత్రం లెక్కలు వేసుకోకుండానే సీపీఎస్ రద్దు హామీ ఇచ్చారని సజ్జల చెపితే ఎవరైనా నమ్ముతారా?. సీపీఎస్ ప్రవేశపెట్టిన సమయంలోనే పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. ఇది రాష్ట్రాలపై తీవ్ర ఆర్ధిక భారం మోపుతుందని..దీర్ఘకాలంలో కొనసాగించలేమనే పలు ప్రభుత్వాలు దీనికి మంగళం పాడాయి. 2014లో ఓటమి తర్వాత హామీల విషయంలో రాజీపడితే గెలవలేమనే విషయాన్ని గుర్తించిన జగన్ నవరత్నాలతో ముందుకొచ్చారు. ఇందులో మెజారిటీ స్కీమ్ లు కాస్త అటో ఇటుగా ప్రస్తుతానికి అమలు అవుతున్నా దీని వల్ల రాష్ట్రంపై పడే భారం ఎలా ఉంటుందో..వీటి వల్ల ఏపీ ఎలా నష్టపోతుందో ఇప్పటికే ప్రజలు అందరూ చూస్తున్నారు. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చటానికి కూడా నిధులు లేక రహదారులు అస్తవ్యస్థంగా మారాయి.
జగన్ ఎన్నికల్లో గెలిచేందుకు తాను ఇచ్చిన నవరత్నాల హామీల అమలుకు ప్రభుత్వంలో ఏటా జరిగే అవినీతిని నియంత్రిస్తే సరిపోతుందని..కొత్తగా భారం కూడా పడదంటూ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో పలుమార్లు ప్రకటించారు. వైఎస్ఆర్ రైతు భరోసా విషయంలోనూ జగన్ అలాగే చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏటా రైతులకు 12500 రూపాయలు ఇస్తానని ప్రకటించి తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కిసాన్ యోజన పథకాన్ని కూడా దీనికి జతచేశారు. అసలు జగన్ రైతు భరోసా హామీ ఇచ్చేటానికి కేంద్రం అసలు ఈ పథకాన్నే ప్రవేశపెట్టలేదు. కానీ తన ఆర్ధికవెసులుబాటు కోసం కేంద్ర పథకాన్ని కూడా రైతు భరోసాలో కలిపేశారు. చంద్రబాబు రైతు రుణ మాఫీ విషయంలో బహిరంగంగా హామీలు గుప్పించి అమలులో విఫలమయ్యారు. ఇప్పుడు జగన్ కూడా సీపీఎస్ అంశంపై తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో ..నెల రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు రివర్స్ గేర్ వేశారు. దీంతో చంద్రబాబుకు, జగన్ కూడా పెద్ద తేడా ఏమీలేదనే విషయం ఏపీ ప్రజలు, ఉద్యోగులకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. తాము అధికారంలోకి రావాలంటే ఎలాంటి హామీలైనా ఇస్తారు...వచ్చాక వాటిని ఎలాగైనా మారుస్తారు అని జగన్ కూడా నిరూపించుకున్నారు.