Telugu Gateway
Telugugateway Exclusives

రాజకీయాల్లో కీలకంగా మారిన వ్యూహకర్తలు..జ్యోతిష్కులు

రాజకీయాల్లో కీలకంగా మారిన వ్యూహకర్తలు..జ్యోతిష్కులు
X

ప్రజల జాతకాలను మార్చగలిగే శక్తి ఒక్క రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో గెలిచిన పార్టీలే పాలనా సాగిస్తాయి...ప్రజలను ఎటు వైపు తీసుకెళ్లాలి అన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అత్యంత కీలకమైన, అతి పెద్ద వ్యాపారం అయిన రాజకీయాల్లో ఇప్పుడు వ్యూహకర్తల డిమాండ్ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది అనే చెప్పాలి. పార్టీ లు కోట్ల రూపాయలు చెల్లించి మరి వీళ్ళను నియమించుకుంటున్నాయి. అధికార పార్టీ లే కాకుండా...ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇదే మోడల్ ఫాలో అవుతున్నారు. వ్యూహకర్తలతో పాటు జ్యోతిష్కుల ప్రభావం కూడా రాజకీయ నాయకులపై బాగానే ఉంటుంది. ఎప్పుడైనా ఒక్క సారి ఒక జ్యోతిష్కుడి అంచనాలు కరెక్ట్ అయితే చాలు అతగాడి మాటలను నమ్మే వాళ్ళు బాగా పెరుగుతూ ఉంటారు. తాజాగా ఇటు తెలంగాణ తో పాటు అటు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక జ్యోతిష్కుడు కీలక అంచనాలను వెలువరించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రుద్ర కరణ్ ప్రతాప్ అనే జ్యోతిష్కుడు చెప్పాడు. తర్వాత అదే జరిగింది. ఇప్పుడు అయన తెలంగాణ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సీఎం కెసిఆర్ అధికారంలోకి వస్తారని తన ట్విట్టర్ పోస్ట్ లో వెల్లడించారు. అయన మే 27 న ఈ ట్వీట్ చేశారు.

అదే లైన్స్ లో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటారు అని వెల్లడించారు. ఈ ట్వీట్ అయన తాజాగా చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీ లకు చెందిన సోషల్ మీడియా టీమ్స్ వీటిని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే అయన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఫలితాలపై అంచనాలు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మరో అంశం కూడా ఉంది. రెండు ట్వీట్స్ కాపీ, పేస్ట్ తరహాలో రాష్ట్రాలు..సీఎం ల పేర్లు మార్పు తప్ప ఒక్క అక్షరం కూడా మారలేదు. అయితే వాస్తవానికి తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వం పై వివిధ వర్గాల ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత ఉంది. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉండటం..కేంద్రీకృత పాలన కావటం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశగా మారాయి. అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లోని అధికారం వైసీపీ కి కూడా గెలుపు అంత ఈజీ గా సాధ్యమయ్యే అవకాశాలేమి లేవు. ఎందుకంటే నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకపోవటం, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పొత్తుతో ఎన్నికలకు వెళుతున్నందున ఈ ప్రభావం వైసీపీ పై పడుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ కొత్త జ్యోతిష్కుడి అంచనాలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయనే చెప్పొచ్చు. జ్యోతిష్కులు పార్టీలను గెలిపించేలా అయితే ఇన్ని తిప్పలు ఎందుకు ఉంటాయని ప్రత్యర్థి పార్టీలు వీటిని కొట్టి పడేస్తున్నాయి.

Next Story
Share it