ఆర్ఆర్ఆర్ సినిమా...ఏపీ పీఆర్ సీ..రెండూ అంతే!
ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాగో..ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ అంశం కూడా అలాగే ఉంది. అసలు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు...ప్రకటిస్తారా లేదా అన్న అంశంపై కూడా క్లారిటీ లేదు. తొలుత సీఎం జగన్ ఓ వారం రోజుల్లో అన్నారు. ఆ తర్వాత సీఎస్ 72 గంటల్లో విడుదల అన్నారు. ఆ వెంటనే సీఎం జగన్ తో భేటీ అన్నారు. వారం పోయింది..72 గంటలు పోయింది..అసలు ఉంటది అనుకున్న సీఎం జగన్ తో భేటీ ఊసే లేదు. జనవరి 3వ తేదీలోపు ప్రకటించకపోతే చూసుకోండి మా సంగతి అని ప్రకటనలు చేసి ఉద్యోగ సంఘం నేతలు ఇప్పుడు కిక్కురుమనటం లేదు. కాకపోతే జనవరి 3న సమావేశం పెట్టుకుని వాళ్లకు వాళ్లు ఓ వాయిదా ఇచ్చుకున్నారు. ఓ వైపు ఉద్యోగులు మా పీఆర్సీ సంగతి తేల్చండి అని డిమాండ్లు చేస్తుంటే.... ఇవ్వాల్సిన జీతమే చాలా మందికి పూర్తిగా ఇంకా అందలేదు. విడతలు విడతలు వారి వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. మంగళవారం నాటి వరకూ కూడా కొంత మంది పెన్షనర్లకు డబ్బులు వారి ఖాతాల్లో పడలేదు. ఏపీ సర్కారుతో ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలకు చాలా పెద్ద చిక్కే వచ్చిపడింది.
పీఆర్సీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేసినా ఉద్యోగ సంఘం నేతలు సమ్మెకు పిలుపు ఇవ్వలేరని..కాదు కూడదు అని సమ్మెకు దిగితే ఆ వచ్చే జీతం కూడా సర్కారు ఆపుతుందని..ఇప్పుడు సర్కారుకు కూడా ఎంత ఖర్చు తగ్గితే అంత మంచిది అన్న చందంగా ఉందని ఓ ఉద్యోగ సంఘం నేత వ్యాఖ్యానించారు. చేసిన పనికి చట్టబద్ధంగా వేతనాలు పొందటానికి కూడా ఇన్ని రోజులు వేచిచూడాల్సి రావటం ఏ మాత్రం సరికాదంటున్నారు ఉద్యోగులు. గత కొంత కాలంగా ప్రతి నెలా వేతనాలు..పెన్షన్లు జాప్యం అవుతుండటంతో బ్యాంకు ఈఎంఐలు కట్టలేక..ఆస్పత్రుల అవసరాల కోసం నానా అవస్థలు పడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అంతే కాదు..ఉద్యోగులకు సంబంధించి వివిధ పద్దుల కింద ఇవ్వాల్సిన ఆరు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని..వాటిని కూడా ఇంత వరకూ సర్దుబాటు చేయటంలేదని మండిపడుతున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చినందున ఇప్పటికైనా పీఆర్సీ అంశానికి ముగింపు వస్తుందా? లేక ఆర్ఆర్ఆర్ మూవీలాగా అలా వాయిదా పడుతూ పోతుందా అన్నది వేచిచూడాల్సిందే.