Telugu Gateway
Telugugateway Exclusives

యశోదా ఆస్పత్రిపై ఐటి దాడుల సంకేతం ఏంటి?!

యశోదా ఆస్పత్రిపై ఐటి దాడుల సంకేతం ఏంటి?!
X

తెలంగాణలో రాజకీయాలతో పాటు అన్నీ వేగవేగంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ బలహీనపడుతున్న సంకేతాలు రావటంతో బిజెపి దూకుడు పెంచింది. ఆ దూకుడు మామూలుగా లేదు. మంగళవారం నాడు యశోదా ఆస్పత్రులతోపాటు ఆస్పత్రికి చెందిన డాక్టర్లపై కూడా ఐటి శాఖ దాడులు చేసింది. ఏకంగా 20 టీమ్ లు దాడుల్లో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం. మంగళవారం ఉదయం నుంచి ఈ దాడులు సాగుతున్నాయి. యశోదా ఆస్పత్రి యాజమాన్యం ముఖ్యమంత్రి కెసీఆర్ కు అత్యంత సన్నిహితం అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో యశోదా ఆస్పత్రిపై ఐటి దాడులు దాడులు జరగటం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో కూడా పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికార పార్టీతో అత్యంత సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు కూడా ఢిల్లీ స్థాయి నుంచి ఇప్పటికే గట్టి ఝలక్ లు వచ్చాయని..దాంతో వారిద్దరూ ప్రస్తుతం అంతా సర్దుకునే పనిలో ఉన్నట్లు పారిశ్రామికవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఓ వైపు ఆ బడా బాబులు ఇద్దరికీ వార్నింగ్ ఇవ్వటం ఒకెత్తు అయితే..ఇప్పుడు యశోధా ఆస్పత్రిపై ఐటి దాడులు జరగటం అధికార టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేయటంతో అప్పుడు ఐటి శాఖ పెద్ద ఎత్తున దాడులు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలపై అప్పట్లో ఐటి దాడులు నిత్యకృత్యంగా సాగేవి. ఇప్పుడు అది తెలంగాణ కు వచ్చినట్లు ఉందని ఓ నేత వ్యాఖ్యానించారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే అని..రాబోయే రోజుల్లో చూడాల్సిన సినిమా ఇంకా చాలా ఉందని వ్యాఖ్యానించారు. అధికార పార్టీని 'ఫిక్స్' చేసేందుకు అవసరమైన సమాచారం అంతా ఆ బడా దగ్గర నుంచి సేకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Next Story
Share it