Telugu Gateway
Telugugateway Exclusives

కెసీఆర్ కు ఆయ‌న ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిన‌ట్లేనా?!

కెసీఆర్ కు ఆయ‌న ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిన‌ట్లేనా?!
X

గ‌త కొంత కాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సేవ‌లు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలో శ‌నివారం నాడు ఢిల్లీలో కీల‌క ప‌రిణామాలు జ‌రిగాయి. 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి అనుస‌రించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌తోపాటు ఇతర కీల‌క నేత‌ల‌కు ఆయ‌న ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఈ ప్ర‌జంటేష‌న్ ను , ప్ర‌శాంత్ కిషోర్ ఐడియాల‌పై నిర్ణ‌యం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్యాన‌ల్ ను ఏర్పాటు చేయ‌నుంద‌ని కెసీ వేణుగోపాల్ అధికారికంగానే ప్ర‌కటించారు కూడా. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గ‌తంలోనే ఇలాంటి ప్ర‌య‌త్నం ఓసారి జ‌ర‌గ్గా అది ముందుకు సాగ‌లేదు. మ‌ళ్ళీ ఇప్పుడు ప్ర‌శాంత్ కిషోర్, కాంగ్రెస్ ల మ‌ధ్య డీల్ కుదిరేలాగానే ఉంది. ఇదే జ‌రిగితే మ‌రి టీఆర్ఎస్, సీఎం కెసీఆర్ ప‌రిస్థితి ఏమిటి అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో సీఎం కెసీఆర్ త‌మ‌కు ప్ర‌శాంత్ కిషోర్ సేవ‌లు అందిస్తున్నార‌ని.ఆయ‌న ప్ర‌జ‌ల ప‌ల్స్ ప‌ట్టుకోవ‌టంలో నిపుణుడు అంటూ కొనియాడారు. అంతే కాదు.ఆయ‌న త‌న‌కు ఏడెనిమిది సంవ‌త్స‌రాల నుంచి స్నేహితుడు అని ప్ర‌క‌టించ‌టంతోపాటు..మీకెవ‌రికి తెలియ‌ని అంశం ఒక‌టుంది..ఆయ‌న డ‌బ్బులు తీసుకుని పని చేయ‌ర‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌శాంత్ కిషోర్ కు ఎవ‌రైనా డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు..ఆయ‌న తీసుకున్న‌ట్లు మీ ద‌గ్గ‌ర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్ర‌శ్నించారు కెసీఆర్. ఈ డీల్స్ అన్నీ తెర‌వెన‌క జ‌రిగే వ్య‌వ‌హారాలు క‌నుకే కెసీఆర్ అంత బ‌హిరంగంగా ఈ మాటలు అన్నార‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా..అలా కాకుండా 2024 ఎన్నిక‌ల వ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీకి వ్యూహ‌క‌ర్త‌గా సేవ‌లు అందించినా తెలంగాణాలో టీఆర్ఎస్ తో కుదిరిన డీల్ ఏమి అవుతుంది అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారుతుంది. కాంగ్రెస్, ప్ర‌శాంత్ కిషోర్ ల మ‌ధ్య డీల్ పై స్ప‌ష్ట‌త రావ‌టానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. తెలంగాణ సాధించిన, రాష్ట్రంపై పూర్తి ప‌ట్టున్న కెసీఆర్ వంటి నేత అస‌లు ప్ర‌శాంత్ కిషోర్ సేవ‌లు ఉప‌యోగించుకోవ‌టం అంటేనే రాజ‌కీయంగా అది ఆయ‌న‌కు మైన‌స్ అని చ‌ర్చ‌లు సాగాయి. ఇంత కాలం చెల్లిన కెసీఆర్ వ్యూహాలు ఒక చెల్ల‌వ‌నే ప్ర‌శాంత్ కిషోర్ ను తెచ్చుకున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా టీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. ఇప్పుడు మ‌రి ఆయ‌న కూడా హ్యాండ్ ఇస్తే ప‌రిస్థిటి ఏంటి?. దీన్ని టీఆర్ఎస్ ఎలా అధిగమిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it