Telugu Gateway
Telugugateway Exclusives

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్యపై ఫిర్యాదు

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్యపై ఫిర్యాదు
X

కొత్త మలుపు తిరిగిన 1519 గజాల 853 ఎఫ్ ఫ్లాట్ వివాదం

ఇప్పటికే తుమ్మల నరేంద్రచౌదరి తదితరులపై కేసు నమోదు

వెంకాయమ్మపై పోలీస్ స్టేషన్ లో జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ పిర్యాదు

జూబ్లిహిల్స్ కో ఆపరేటింగ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కు చెందిన 1519 గజాలకు చెందిన 853 ఎఫ్ వివాదం కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఈ ఫ్లాట్ తమదే అంటూ ఏపీకి చెందిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య పత్తిపాటి తీనే వెంకాయమ్మ ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు ఈ ఫ్లాట్ లోకి ప్రవేశించి జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన బోర్డును తొలగించటంతోపాటు..సైట్ లో నానా హంగామా చేశారని, సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సైట్ లోకి ప్రవేశించటంతోపాటు..అక్కడ పెట్టిన బోర్డు తొలగింపు తదితర అంశాలపై ఆదివారం రాత్రి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసింది. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు..బెదిరింపు ధోరణితో ఆక్రమించేందుకు ప్రయత్నం చేసిన పత్తిపాటి తీనే వెంకాయమ్మ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫ్లాట్ తమదే అని..తాము కొనుగోలు చేశామని పత్తిపాటి తేనే వెంకాయమ్మ చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన గత కమిటీ ప్రెసిడెంట్ తుమ్మల నరేంద్ర చౌదరి, సెక్రటరితోపాటు మేనేజింగ్ కమిటీ 2020 జూన్ 26న సిహెచ్ శిరీష పేరుతో సేల్ డీడ్ చేశారు. దొంగ వ్యక్తిని సృష్టించి ఈ లావాదేవీ నిర్వహించారని ఇఫ్పటికే సొసైటీ పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేయగా..నరేంద్ర చౌదరితోపాటు కార్యదర్శి తదితరులపై కూడా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. అక్రమంగా ఈ ఫ్లాట్ పొందిన సిహెచ్ శిరీష తర్వాత ఈ ఫ్లాట్ ను పి. శ్రీహరికి గిఫ్ట్ గా ఇఛ్చేసింది. పి. శ్రీహరి మళ్లీ ఈ ఫ్లాట్ ను 2020 డిసెంబర్ 31 న ఎల్లో స్టోన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటడ్ లో డైరక్టర్ గా ఉన్న పత్తిపాటి వెంకాయమ్మకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఏజీపీఏ) రిజిస్టర్ చేశారు.

దీంతో ఆమె ఇప్పుడు ఈ ఫ్లాట్ తమదే అని హక్కులు కోరుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఈ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రత్తిపాటి వెంకాయమ్మ పాత మేనేజింగ్ కమిటీతో కలసి కుట్ర చేశారని సొసైటీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీని వెనక పెద్ద కుట్ర్ సాగినట్లు కన్పిస్తోందని..సొసైటీ 2002 నుంచి అసలు ఈ ఫ్లాట్ స్థలాన్ని శిరీష కు స్వాధీనం చేయలేదన్నారు. ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దశంతోనే పి . శ్రీహరి పేరుతో ఐదు చెక్ లు ఇచ్చి ఏజీపీఏ చేయించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. సొసైటీకి నష్టం చేసేందుకు పత్తిపాటి వెంకాయమ్మ తదితరులు ఇతరులతో కలసి మోసం, ఫోర్జరీ, చొరబాటు వంటి చర్యలకు పాల్పడ్డారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story
Share it