Telugu Gateway
Telugugateway Exclusives

డొనాల్డ్ ట్రంప్ లా..నరేంద్రమోడీ!

డొనాల్డ్ ట్రంప్ లా..నరేంద్రమోడీ!
X

నిపుణుల సిఫారసులను పట్టించుకోని వైనం

దేశ వ్యాప్త లాక్డౌన్ పై అదే వైఖరి !

సేమ్ టూ సేమ్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లానే.. భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారా?. నిపుణుల సూచనలను పెడచెవిన పెడుతున్నారా?. అంటే ఔననే అంటున్నారు వైద్య రంగంలోని నిపుణులు. గత కొన్ని రోజులుగా అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు, వైట్ హౌస్ సలహాదారు అంటోనీ పౌచీ భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కు బ్రేక్ పడాలంటే కనీసం పది..పదిహేను రోజుల పాటు అయినా దేశ వ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అంటోనీ పౌచీ సలహాలు మనం ఎందుకు పాటించాలి అనుకుంటే ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా గత కొన్ని రోజులుగా ఇదే అంశంపై పలుమార్లు బహిరంగంగా దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రతిపాదనలు చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు ఏ మాత్రం సరిపోవని..డాక్టర్లు కూడా ఈ ఒత్తిడిని ఎక్కువ కాలం ఎదుర్కొలేరని స్పష్టం చేశారు. వలస కార్మికులతోపాటు..ఇతర పేదల అంశాన్ని పరిగణనలోకి తీసుకునే కొన్ని రోజుల పాటు అయినా లాక్ డౌన్ తప్పనిసరి అని ఆయన సూచిస్తూ వస్తున్నారు. ఇంకో ప్రధానమైన అంశం ఏమిటంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే వైరస్ రూపాంతరాలు చెంది..మనుషుల్లోని ఇమ్యూనిటినీ కూడా అధిగమించే స్థాయి వస్తే మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్య రంగంలోని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవేమీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకునే పరిస్థితిలో కన్పించటంలేదు. పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూలు, వారాంతాపు లాక్ డౌన్ ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గులేరియా స్పష్టం చేస్తున్నారు. పరిస్థితి మరింత విషమించాక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సి వస్తే అప్పుడు జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని ఓ సీనియర్ డాక్టర్ అభిప్రాయపడ్డారు. అటు ఆర్ధికపరంగా నష్టంతో..ఆరోగ్యపరంగా కూడా సమస్యలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. పోనీ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏమైనా యుద్ధ ప్రతిపాదికన చేపట్టారా అంటే అది కూడా లేదు. ఎలాంటి ముందస్తు కార్యాచరణ లేకుండా మే 1 నుంచి 18 సంవత్సరాల వాళ్లకు కూడా వ్యాక్సిన్ అని ప్రకటించారు కానీ..అది అమలు అవుతున్నది అంతంత మాత్రమే. కరోనా వైరస్ వ్యాప్తికి దేశంలోని రాష్ట్రాలు అన్నీ కలిపి ఒకేసారి కార్యాచరణ తీసుకుంటే తప్ప..విడివిడి చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వవని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంత మంది చెప్పినా ప్రధాని మోడీ మాత్రం 'లాక్ డౌన్' విషయంలో ఒకటే మాట చెబుతున్నారు. ఆయన ఈ భారాన్ని పూర్తిగా రాష్ట్రాలకే వదిలేశారు. దేశంలోని పలు ప్రధాన రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరత, డాక్టర్లపై విపరీతమైన ఒత్తిడి వంటి ఎన్నో సమస్యలు ఉంటే అసలు కేంద్రంలో ఓ వార్ రూమ్ ఏర్పాటు, సీనియర్ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి నిత్యం పరిస్థితిని సమీక్షించేలా ఏర్పాటు చేయాల్సిన ప్రధాని మోడీ ఆ దిశగా పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని..ఇది మాత్రం సరికాదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నారు. కరోనా తొలి దశ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిపుణుల సిఫారసుల పూర్తిగా విస్మరించారు. కరోనా వైరస్ ను గుర్తించినట్లు వార్తలు వచ్చిన వెంటనే అమెరికాకు విమాన రాకపోకలపై నిషేధం విధించకుండా విపరీత జాప్యం చేయటం వల్లే అగ్రరాజ్యం తొలి దశలో అంతగా అల్లకల్లోలం అయిందనే విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అంటోనీ పౌచీ గతంలో పలుమార్లు ప్రకటించారు కూడా. సేమ్ తొలి దశ కరోనా సమయంలో అమెరికా అప్పటి అధ్యక్ష్యుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా చేశారో...ప్రస్తుతం మోడీ కూడా అలాగే చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it