Telugu Gateway
Telugugateway Exclusives

లింగమనేని కి రాజ్యసభ ఇస్తే జనసేనలో రచ్చ తప్పదా?

లింగమనేని కి రాజ్యసభ ఇస్తే జనసేనలో రచ్చ తప్పదా?
X

లింగమనేని కి రాజ్యసభ ఇస్తే జనసేనలో రచ్చ తప్పదా?

జనసేనలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం !

ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తనకు వచ్చే తొలి రాజ్య సభ సీట్ ఎవరికి ఇవ్వబోతుంది?. ఇతర పార్టీల తరహాలోనే జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కార్పొరేట్ రాజకీయాల తరహాలోనే వ్యవహరిస్తారా?. లేక పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు తొలి సీటు ఇస్తారా అన్న చర్చ ఇప్పుడు జనసేన లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు దేశంతో పాటు వైసీపీ లు కూడా బడా బడా పారిశ్రామికవేత్తలు..కాంట్రాక్టర్లకు రాజ్యసభ సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ అయితే ఏకంగా రిలయన్స్ గ్రూప్ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్న పరిమళ్ నత్వానికి రాజ్య సభ సీట్ ఇచ్చి పార్టీ నేతలను కూడా షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ పార్టీల్లో రాజ్య సభ సీట్ల కేటాయింపు పూర్తిగా ఆ పార్టీ అధినేత ఇష్టప్రకారమే జరుగుతాయి అనే విషయం తెలిసిందే.

జనసేన కు వచ్చే ఒక్క సీటు వివాదాస్పద పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు కేటాయించే అవకాశం ఉంది అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇప్పటి వరకు లింగమనేని రమేష్ పేరు తప్ప మరో వ్యక్తిపేరు ఏదీ కూడా తెరమీదకు రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ తన సినిమాలకు లింగమనేని రమేష్ స్థలం ఇచ్చారు అనో ...లేక తెర వెనక వివిధ విషయాల్లో తనకు సహకరిస్తున్నారు అనే కారణంతో ఆయనకు అత్యంత కీలకమైన రాజ్య సభ సీటు ఇస్తే మాత్రం జనసేనలో చిచ్చు రాజుకోవటం ఖాయం అని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీరుపై చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని...ప్రచారం జరుగుతున్నట్లు జనసేనకు వచ్చే ఒక్క రాజ్య సభ సీటు లింగమనేని రమేష్ కు ఇస్తే మాత్రం అది మరింత పెరగటంతో పాటు కొంత మంది నేతలు బహిరంగ విమర్శలకు కూడా ఏ మాత్రం వెనకాడకపోవొచ్చు అనే చర్చ సాగుతోంది.

ఈ రాజ్య సభ సీటు కేటాయింపు మాత్రం ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లు లింగమనేని రమేష్ కు ఇస్తే మాత్రం జనసేనలో రచ్చ తప్పదు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. జూన్ లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నలుగురు రాజ్య సభ సభ్యుల పదవి కాలం ముగియనుంది. ఈ నాలుగు సీట్లు కూడా కూటమి పార్టీలకే దక్కనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల నోటిఫికేషన్ మే 15 తర్వాత వచ్చే అవకాశం ఉంది అధికార వర్గాలు చెపుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు లింగమేని రమేష్ తో పాటు ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు అయిన పారిశ్రామికవేత్త, మరో కీలక సినీ నిర్మాత పేరు కూడా ప్రచారంలోకి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ తనకు దక్కే తొలి రాజ్యసభ సీటు విషయంలో తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం కానుంది అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it