Telugu Gateway
Telugugateway Exclusives

పవన్ కు వారాహి యాత్ర లాభం ఎంత?!

పవన్ కు వారాహి యాత్ర లాభం ఎంత?!
X

రాజకీయాల్లో అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కసి ఒక్కటే ఉంటే చాలదు. అంతకు మించి వ్యూహాలు కూడా కావాలి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ని ఎలాగైనా ఓడించాలి అనే కసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు కానీ...ఈ దిశగా అయన ప్రయాణం ఎంత మేర విజయవంతం అవుతుంది అంటే ఇప్పటికిప్పుడే చెప్పటం కష్టం. దీనికి ప్రధాన కారణం అయన చేసే గందరగోళ ప్రకటనలే. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి...ఎమ్మెల్యేగా ఓటమి వంటి అంశాలపై తరచూ చేసే గందరగోళ ప్రకటనలు జనసైనికులను కూడా ఒకింత గందరగోళంలోకి నెడుతున్నాయనే చెప్పొచ్చు. వీటినే జనసేన ప్రత్యర్థులే అస్త్రాలుగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్ర జనంపరంగా చూసుకుంటే విజయవంతం అయినట్లే లెక్క. అదే సమయంలో పవన్ వారాహి యాత్ర సాగినంత కాలం సీఎం జగన్ దగ్గ్గర నుంచి ఆంధ్ర ప్రదేశ్ అధికార వైసీపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు చంద్ర బాబు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేశారు. వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయ ఫోకస్ ను తన వైపు తిప్పుకోగలిగారు. కానీ గందరగోళ ప్రకటనలతో రావాల్సినంత మైలేజ్ ను పొందలేక పోయాయనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా అయన చెప్పే అంశాలు ప్రజల్లోకి బలంగా వెళతాయి.

అయితే ఈ సారి వారాహి యాత్రలో తొలిసారి టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో లు ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, రవి తేజ వంటి హీరో ల పేర్లు కూడా ప్రస్తావించి వీరందరిని తాను అభిమానిస్తానని...ఎవరి అభిమానాలు ఎలా ఉన్నా రాజకీయం దగ్గరకు వచ్చాక రాష్ట్రం కోసం అలోచించి ఓటు వేయాలని పదే పదే కోరటం ద్వారా అయన కొత్త ప్లాన్ ను అమలు చేసినట్లు అయింది అనే చెప్పాలి. తన అభిమానుల ఒక్కరితోనే పని కాదు అని...అందరి అభిమానులను తన వైపు తిప్పుకోగలితే రాజకీయంగా ఇది వర్క్ అవుట్ అవుతుంది అని పవన్ వేసిన ప్లాన్ మాత్రం ఇక్కడ కీలకం అని చెప్పుకోవాలి. దీని ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఎన్నికల తర్వాత కానీ తేలదు కానీ....ప్రయత్నం మాత్రం కచ్చితంగా రాజకీయంగా మేలు చేసేదే అని చెప్పొచ్చు. శుక్రవారం నాడు భీమవరం లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర పంటగా గంజాయి...రాష్ట్ర ఆయుధంగా గొడ్డలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ బాబాయ్ వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ను ఉద్దేశించే ఈ గొడ్డలి కామెన్స్ చేసినట్లు స్పష్టం అవుతోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ఆయనకు సొంతంగా ఎంత లాభం జరిగింది అనే విషయాన్నీ లెక్కగట్టే కొలమానం ఏమి లేదు కానీ...అధికార వైసీపీ లో మాత్రం అయన అలజడి రేపటంలో మాత్రం విజయవంతం అయ్యారనే చెప్పాలి. సీఎం జగన్ దగ్గర నుంచి వైసీపీ మంత్రుల స్పందన చూస్తేనే ఈ విషయం తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ సారి అధికార వైసీపీ కి ఒక్కటంటే ఒక్క సీట్ కూడా రానివ్వను అని పవన్ కళ్యాణ్ చెపితే అసలు పవన్ ఎక్కడ...ఎలా గెలుస్తాడా చూస్తాం అంటూ వైసీపీ మంత్రులు కూడా ప్రతి సవాళ్లు విసిరారు.

Next Story
Share it