మరోసారి పరువు తీసుకున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి పరువు తీసుకున్నారు. గురువారం నాడు తనను కలవటానికి బిజెపి నేతలు వస్తున్నారని ప్రకటించుకున్నారు. కానీ ఎవరూ రాలేదు. కానీ నామినేషన్ల చివరిరోజు అయిన శుక్రవారం నాడు మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరికొంత మందినేతలు పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. అంతే పవన్ కళ్యాణ్ తన మాటను తానే తుంగలో తొక్కారు. అంతకు ముందు తానే స్వయంగా జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించారు. కానీ రెండు రోజుల వ్యవధిలోనే సీన్ అంతా మార్చేశారు.చివరినిమిషం వరకూ అసలు బిజెపి తనను పట్టించుకోని విషయాన్ని కూడా ఆయన విస్మరించారు. తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్అయితే తమను ఎవరూ పొత్తుల గురించి అడగలేదని బహిరంగంగా ప్రకటించి పవన్ కళ్యాణ్ కుఒక రకంగా షాక్ ఇచ్చారు. అవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్‌మాత్రం బిజెపి, మోడీ అవసరం చాలా ఉంది అంటూ కీలక ప్రకటనలు అయితే చేస్తున్నారు. ఓ వైపు ఏపీలో అమరావతి విషయంలో బిజెపి చెప్పేదొకటి చేసేదొకటి అయినా సరే ఆ పార్టీని మోసే బాద్యతను ఆయన తీసుకున్నారు.
ఇప్పుడు తెలంగాణాలో కూడా కనీస గుర్తింపు ఇవ్వకపోయినా సరే రెండు, మూడు నెలల నుంచి జీహెచ్ఎంసీఎన్నికల కోసం ఎంతో కష్టపడుతున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అందరి కష్టాన్ని పవణ్ కళ్యాణ్ విస్మరించి బిజెపి కోసం నామినేషన్లు వేసిన జనసేన వారిని కూడా ఉపసంహరించుకోవాలని సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ అసలు పార్టీ పెట్టింది పోటీ చేయటానికా..లేక ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వటానికా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బిజెపి ఎంతగా అవమానిస్తున్నాఆ పార్టీని విమర్శించకపోగా బిజెపిని వెనకేసుకు రావటానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని వెనక బలమైన కారణాలు ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.